జియోతో పోటీకి ఎయిర్టెల్ సిద్ధమే
న్యూఢిల్లీ : టెలికాం పరిశ్రమలో ప్రకంపనాలు సృష్టిస్తూ వచ్చిన రిలయన్స్ జియో, తమకు ప్రధాన ప్రత్యర్థేనని ఎయిర్టెల్ కంపెనీ చైర్మన్ సునీల్ మిట్టల్ వెల్లడించారు. జియో ప్రధాన ప్రత్యర్థైనప్పటికీ, దాన్ని ఎదుర్కొని మార్కెట్లో టాప్ లీడర్‌గా కొనసాగడానికి తాము సిద్ధంగానే ఉన్నామని ప్రకటించారు. జియో లాంచింగ్ అనంతరం సునీల్ మిట్టల్ ఇచ్చిన మొదటి ఇంటర్వ్యూలో ఈ విషయాలు వెల్లడించారు. మరోవైపు జియో చేస్తున్న ఆరోపణలను ఇంటర్ కనెక్షన్, కస్టమర్ల మొబైల్ నంబర్ పోర్టబిలిటీ సమస్యలను ఎయిర్టెల్ త్వరలోనే పరిష్కరిస్తుందని చెప్పారు. తాము ఎల్లప్పుడూ పోటీ వాతావరణాన్ని ఆహ్వనిస్తామని, ఇతర టెలికాం కంపెనీలు ఏటీ అంట్ టీ, హచిన్సన్, టెలినార్, ఐడియా, వొడాఫోన్ కంపెనీలతో రోజువారీ టెలికాం వార్ నడుస్తూనే ఉంటుందని వెల్లడించారు. పోటీవాతావరణంతో వినియోగదారులకు మెరుగైన సేవలను అందించవచ్చన్నారు.
ఇంత తీవ్రమైన పోటీవాతావరణంలో కూడా ఎయిర్టెల్ కంపెనీనే నెంబర్.1 కంపెనీగా నిలుస్తుందని ఆయన హర్షం వ్యక్తంచేశారు. జియో వచ్చినప్పటికీ, ఎయిర్టెల్ కంపెనీనే టాప్‌లో కొనసాగుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. పార్టీల సంప్రదింపులతో జియో తన సమస్యను పరిష్కరించుకోవాలని హితవు పలికారు. ఈ సమస్యలను పరిష్కరించడానికి ఎయిర్టెల్ చురుగ్గా ఉందన్నారు.తమ మొబైల్ నెట్వర్క్ నుంచి కాల్స్‌ను వారి నెట్‌వర్క్‌లతో కనెక్ట్ చేయడానికి సరిపడా పోర్ట్స్ ఆఫ్ ఇంటర్‌కనెక్ట్(పీఓఐ) పరికరాలను ప్రస్తుత టెల్కోలు అందుబాటులో ఉంచడం లేదని జియో ఆరోపిస్తోంది. అయితే ఇప్పటివరకు ఏ టెల్కో నుంచి తమపై ఇలాంటి ఆరోపణలను ఎయిర్టెల్ ఫేస్ చేయలేదని, జియోకు అవసరమైన పీఓఐలను విడుదల చేస్తామని సునీల్ మిట్టల్ తెలిపారు. మొదటిసారి పుష్కలమైన స్పెక్ట్రమ్, త్వరలో నిర్వహించబోయే ఆక్షన్ ముందు ఉంచామన్నారు.