పర్యాటక ప్రాంతాల్లో సదుపాయాలు
సమీక్షా సమావేశంలో కలెక్టర్ అరుణ్‌కుమార్
కాకినాడసిటీ :
జిల్లాలో పర్యాటక అభివృద్ధిలో భాగంగా గుర్తించిన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని కలెక్టర్ అరుణ్‌కుమార్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. జిల్లాలో పర్యాటక ప్రాంతాల అభివృద్ధిపై మంగళవారం కలెక్టరేట్‌లోప్రత్యేక సమావేశం నిర్వహించారు. జిల్లాలో 71 ప్రాంతాలను పర్యాటకప్రాంతాలుగా గుర్తించామని, వీటిలో ప్రధానమైన ప్రాంతాల్లో ఆయా శాఖలు రోడ్లు, విద్యుత్, మంచినీటి సౌకర్యం, టాయిలెట్స్ వంటి సదుపాయాలు కల్పిస్తామన్నారు. ఈ ప్రాంతంలో మౌలిక సదుపాయాల కల్పనకు అవసరమైన నిధులకు వెంటనే అంచనాలు రూపొందిస్తే ఆయా శాఖల నుంచి నిధులు ఖర్చుచేస్తామన్నారు.
హోప్ ఐలాండ్‌కు కోరంగి నుంచి టూరిజం బోట్స్
కోరంగి నుంచి హోప్‌ఐలాండ్‌కు టూరిజం బోట్స్ నడిపేలా చర్యలు తీసుకోవాలని టూరిజం అధికారులకు కలెక్టర్ సూచించారు. దీని వల్ల ప్రకృతి సిద్ధమైన వనరులను పర్యాటకులు తిలకించే అవకాశం లభిస్తుందని, ఈ మేరకు కోరంగి అభయారణ్య వద్ద డ్రెడ్జింగ్ పనులు చేపట్టాలన్నారు. అదే విధంగా హోప్‌ఐలాండ్‌లో అనువుగా ఉన్న 90 హెక్టార్లలో పెద్ద ఎత్తున మొక్కలు పెంచే కార్యక్రమాన్ని చేపట్టాలని, దీని కోసం ఒక ప్రణాళిక రూపొందించాలని అభయారణ్య డీఎఫ్‌వో ప్రభాకర్‌కు ఫోన్లో సూచించారు. జిల్లాలో పర్యాటక ప్రాంతమైన ఆదుర్రులో రూ.1.20కోట్లతో అప్రోచ్‌రోడ్డు, గట్ల పటిష్టత, భవన నిర్మాణాల కొనసాగుతున్నాయని, ఈ ప్రాంతాలకు పాశర్లపూడి నుంచి అప్పనపల్లి వరకు హౌస్‌బోట్ ప్రతిపాదన కూడా ఉందన్నారు. పాపికొండలకు పర్యాటకులను తీసుకువచ్చే బోట్లకు తప్పనిసరిగా రెండు ఇంజన్లు, నీటి లోతులు తెలిపే పరికరాలు, బీమా ఉండాలన్నారు. ఇటువంటి సౌకర్యాలు కలిగిన బోట్లను మాత్రమే అనుమతించాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. జిల్లాలోని ఏజన్సీలోని రంప వాటర్ ఫాల్స్ వద్ద కమ్యూనిటీ టాయిలెట్స్‌ను ఏర్పాటు చేయాలని గ్రామీణ నీటి సరఫరా శాఖ అధికారులకు సూచించారు. భూపతిపాలెం రిజర్వాయర్ గట్లపై ఉపాధిహామీ పథకం ద్వారా మొక్కలను పెంచాలని, మారేడుమిల్లిలో సోలార్ విద్యుత్ ద్వారా ఎల్ఈడీ బల్బులు ఏర్పాటు చేయాలని, ధవళేశ్వరంలో సర్ఆర్దర్కాటన్ మ్యూజియంను ఆధునికీకరించాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో పర్యాటక శాఖ రీజనల్ డైరెక్టర్ భీమశంకరం, ఆర్‌డబ్ల్యూస్ ఎస్ఈ రాజేశ్వరరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.