ప్రపంచ పర్యాటక ప్రదర్శన ప్రారంభం
చెన్నై, సాక్షి ప్రతినిధి : ప్రపంచంలోని పలు పర్యాటక కేంద్రాలను ప్రజలకు పరిచయం చేసేందుకు రూపొందించిన ప్రదర్శన చెన్నైలోని ట్రేడ్ సెంటర్లో శుక్రవారం ప్రారంభమైంది. ఇండియా ఇంటర్నేషనల్ ట్రావెల్ మార్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ ప్రదర్శనలో తమిళనాడుతోపాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, పంజాబ్, హిమాచల్‌ప్రదేశ్, మహారాష్ట్ర, జార్ఖండ్, పశ్చిమబెంగాల్ తదితర 15 రాష్ట్రాలు, గోవా, పదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతాల టూరిజం శాఖలతోపాటు థాయ్‌లాండ్, మలేషియా, దుబాయ్, స్విట్జర్ల్యాండ్, మాల్దీవులు, భూటాన్, నేపాల్ దేశాల వారు స్టాళ్లను ఏర్పాటు చేశారు. స్టాళ్ల వద్ద ఆయా దేశాలు, రాష్ట్రాల టూరిజం ప్రతినిధులు తమ ప్రాంతాల్లోని విశేషాలను, ప్రదేశాలను, ఎలా చేరుకోవాలో వివరించారు.
మీడియా సమావేశంలో స్పేర్ ట్రావెల్‌మీడియా, ఎగ్జిబిషన్స్ డెరైక్టర్ రోహిత్హంగల్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 8 నగరాల్లో నిర్వహించనున్న ఈ ప్రదర్శనలను తొలిసారిగా చెన్నైతోనే ప్రారంభించామన్నారు. ఈనెల 13వ తేదీతో చెన్నైలో ముగించుకుని 18 నుంచి 28వ తేదీ వరకు బెంగళూరులో రెండో ప్రదర్శన నిర్వహిస్తామని తెలిపారు. ఆ తరువాత వరుసగా ఢిల్లీ, ముంబై, పూనే, హైదరాబాద్, కొచ్చిన్, కోల్‌కతాలో ప్రదర్శన ఉం టుందన్నారు.
పర్యాటకంపై ప్రజల్లో ఆశలున్నా ఖరీదైన వ్యవహారమనే భావనతో వెనక్కుతగ్గుతున్నారన్నారు. అవగాహనతో ఏర్పాట్లు చేసుకోవడం ద్వారా అతి చౌకగానే పర్యాటక ప్రాంతాలను సందర్శించవచ్చని చెప్పారు. తమ ప్రదర్శనల ఉద్దేశం ప్రజలకు చేరువయ్యేందుకేనని వివరించారు. ప్రదర్శన ప్రారంభ సూచికగా గుజరాత్ టూరిజం వారు ఏర్పాటుచేసిన జానపద నృత్యాలు ఆహూతులను అలరించాయి.