tourism packages
-
పర్యాటక ప్యాకేజీలతో ఆదాయం పరుగు
సాక్షి, అమరావతి: రాష్ట్ర పర్యాటకశాఖ ప్రకటిస్తున్న ప్యాకేజీల కారణంగా ఆ శాఖ ఆదాయం గణనీయంగా పెరుగుతోంది. రాష్ట్రంలో గతేడాది ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు రూ.24.05 కోట్లు ఆర్జించింది. ఇందులో తిరుపతి ప్యాకేజీల నుంచే అత్యధికంగా రూ.18 కోట్లు రావడం విశేషం. ఒక్క డిసెంబర్లోనే రూ.4 కోట్ల వరకు ఆదాయం వచ్చింది. ఆ తర్వాత విశాఖ లోకల్‌టూర్లకు ఎక్కువ ఆదరణ లభిస్తోంది. మరోవైపు కార్తీకమాసంలో శైవక్షేత్రాలు, శక్తిపీఠాల ప్యాకేజీలు కొంతమేరకు ఆదాయవృద్ధికి దోహదపడ్డాయి. ప్రస్తుతం పర్యాటక శాఖ 35 టూర్ ప్యాకేజీలను నడుపుతూ.. 30 సొంత బస్సుల్లో ప్రయాణికులకు మెరుగైన సేవలందిస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్, ముంబయి వంటి మెట్రో నగరాల నుంచి తిరుపతికి విమాన ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చింది. గ్రాండ్ కేనియన్ ఆఫ్ ఇండియాగా పిలిచే గండికోటకు బెంగళూరు, హైదరాబాద్ నుంచి పర్యాటకుల రాకను ప్రోత్సహిస్తున్నారు. కోవిడ్ ప్రారంభమైన తర్వాత పడిపోయిన పర్యాటకశాఖ ఆదాయం ప్యాకేజీలతో తిరిగి పుంజుకుంటుంది. తిరుపతికి ఇలా.. రవాణాతో పాటు వసతి, స్వామివారి దర్శనం కల్పిస్తుండడంతో తిరుపతి టూర్ ప్యాకేజీలకు మంచి ఆదరణ లభిస్తున్నది. ప్రస్తుతం కర్నూలు, ఒంగోలు, ప్రొద్దుటూరు, విజయవాడ, హైదరాబాద్, చెన్నై, విశాఖపట్నం, బెంగళూరు నుంచి తిరుపతికి పర్యాటక శాఖ బస్సులు నడుపుతోంది. మరోవైపు చెన్నై–వళ్లూరు–తిరుపతి, తిరుపతి–శ్రీశైలం, తిరుపతి–కాణిపాకం–స్వర్ణ దేవాలయం, అరుణాచలం తదితర లోకల్ ప్యాకేజీలను అందిస్తోంది. లోకల్ టూరిజం.. స్థానిక పర్యాటకాన్ని ప్రోత్సహించేలా విశాఖపట్నం–లంబసింగి, విశాఖపట్నం–అరసవిల్లి దేవాలయం, రాజమండ్రి–మారేడుమిల్లి, కర్నూలు–శ్రీకాకుళం–నంద్యాల, శ్రీకాకుళంలో అరసవిల్లి–శ్రీకూర్మం–శాలిహుండం–కళింగపట్నంకు ఒక్కరోజులో చుట్టివచ్చే అవకాశాన్ని కల్పిస్తోంది. అలాగే సర్క్యూట్ టూరిజంలో భాగంగా కొత్తగా అనంతపురం–కదిరి–వేమనగారి జన్మస్థలం ప్రాంతం–గండి ఆంజనేయస్వామి దేవాలయం, గండికోట, బెలూం గుహలు, తాడిపత్రి వెంకటేశ్వరస్వామి దేవాలయంతో కలిపి రెండు రోజుల ప్యాకేజీని రూపొందించింది. ఈ ప్యాకేజీల ద్వారా పర్యాటక శాఖ సిబ్బంది జీతాలు, రవాణా ఖర్చులు అన్నీ పోనూ నికరంగా సుమారు రూ.6 కోట్లకు పైగా ఆదాయం లభించింది. పర్యాటకానికి కొత్త ఉత్సాహం రాష్ట్ర వ్యాప్తంగా సర్క్యూట్ టూరిజాన్ని ప్రోత్సహిస్తున్నాం. కొత్తగా హైదరాబాద్, ముంబయి నుంచి విమాన ప్యాకేజీని ప్రవేశపెట్టాం. దేశంలోని ప్రధాన నగరాల్లోనూ ఏపీ టూరిజం కేంద్రాలను ఏర్పాటు చేయనున్నాం. – ముత్తంశెట్టి శ్రీనివాసరావు, రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి సొంత బస్సుల్లో సురక్షితంగా.. కోవిడ్ నిబంధనలు అనుసరిస్తూనే పర్యాటక ప్యాకేజీలను నడుపుతున్నాం. కోవిడ్ కారణంగా రెండేళ్లలో ఎన్నడూ లేనంత వృద్ధి కేవలం ఆరు నెలల్లో సాధించాం. సొంత బస్సుల్లో సురక్షితంగా పర్యాటకులను తీసుకెళ్లి తీసుకొస్తుండడంతో ఎక్కువ ఆదరణ లభిస్తోంది. – ఎస్. సత్యనారాయణ, ఏపీటీడీసీ ఎండీ -
ఒక్క రోజులో.. అదిరిపోయే టూర్లు!
సాక్షి, అమరావతి: కార్తీక మాసంలో ఆధ్యాత్మికతో పాటు ఆహ్లాదాన్ని పంచేలా ‘వన్డే’, ప్రత్యేక టూర్లకు రాష్ట్ర పర్యాటక శాఖ ప్రణాళికలు రూపొందించింది. హైదరాబాద్ నుంచి ఒక్క రోజులో వచ్చి, వెళ్లేలా కూడా ప్యాకేజీలను అందుబాటులోకి తెస్తోంది. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల నుంచి సర్క్యూట్ల వారీగా దేవాలయాలు, సందర్శనీయ ప్రాంతాలను కలుపుతూ షెడ్యూల్ తయారు చేసింది. ప్రస్తుతం విశాఖ నుంచి ప్రతి సోమవారం పంచారామాలైన అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామం, సామర్లకోట శైవక్షేత్రాలను సందర్శించేందుకు పెద్దలకు రూ.1,685, పిల్లలకు రూ.1,350 టికెట్ ధరలతో ప్రయాణ సౌకర్యాన్ని కల్పించింది. అలాగే విజయవాడ నుంచి కూడా ప్రతి సోమవారం పంచారామాలను దర్శించుకునేందుకు పెద్దలకు రూ.1,430, పిల్లలకు రూ.1,190 ధరలతో పర్యాటక శాఖ టూర్ ఏర్పాటు చేసింది. తిరుపతి నుంచి కాణిపాకం, గోల్డెన్ టెంపుల్, అరుణాచలం, కంచి, తిరుత్తణిని సందర్శించేందుకు పెద్దలకు రూ.2,040, రూ.2,330, రూ.3,130, పిల్లలకు రూ.1,635, రూ.1,865, రూ.2,505 టికెట్ రేట్లతో(రెండు రాత్రులు, ఒక పగలు) యాత్రలకు రూపకల్పన చేసింది. ప్యాకేజీలకు అనుగుణంగా రవాణాతో పాటు భోజన, వసతి సౌకర్యాలు కూడా కల్పిస్తోంది. రాయలసీమ సర్క్యూట్లో ఇలా.. ఒక్క రోజు యాత్ర: తిరుపతిలోని టీటీడీ శ్రీనివాసం నుంచి ప్రతి సోమవారం తలకోన సిద్ధేశ్వరాలయం, గుడిమల్లం పరుశురామేశ్వరాలయం, కపిలేశ్వరస్వామి ఆలయం, తొండవాడ అగస్తేశ్వరస్వామి ఆలయాన్ని సందర్శించవచ్చు. వీటికి టికెట్ ధరను రూ.500గా నిర్ణయించింది. అలాగే ప్రతి రోజూ తిరుపతి సమీపంలోని ఆలయాలకు గైడ్ సౌకర్యంతో రూ.175, రూ.375 టికెట్ రేట్లతో ప్రయాణ సౌకర్యం కల్పిస్తోంది. శ్రీకాళహస్తి, కాణిపాకం, తలకోనకు విడివిడిగా స్థానిక ఆలయాలను కూడా సందర్శించేలా రూ.375తో ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చింది. రెండు రోజుల యాత్ర: శ్రీశైలం, మహానందికి ప్రతి మంగళవారం టీటీడీ శ్రీనివాసం నుంచి రెండు రోజుల యాత్ర ప్రారంభమవుతుంది. శ్రీశైలం, మహానంది, నందవరం, యాగంటి, బెలూం గుహలు, అల్లాడుపల్లి దేవాలయాలను సందర్శించవచ్చు. పెద్దలకు టికెట్ ధర రూ.3,960, పిల్లలకు రూ.3,165గా నిర్ణయించింది. ఉత్తరాంధ్రను చుట్టేసేలా.. విశాఖ నుంచి లంబసింగి, కొత్తపల్లి వాటర్‌ఫాల్స్, మత్స్యగుండం, మోదుకొండమ్మ ఆలయాన్ని దర్శించేందుకుగాను పెద్దలకు రూ.1,970, రూ.1,850, పిల్లలకు రూ.1,575, రూ.1,480గా టికెట్ ధరలను పర్యాటక శాఖ నిర్ణయించింది. శక్తిపీఠాలైన పిఠాపురం, ద్రాక్షారామంతో పాటు అన్నవరం సందర్శనకు పెద్దలకు రూ.1,180, రూ.1,200, రూ.1,375, రూ.1,200, పిల్లలకు రూ.945, రూ.960 టికెట్ రేట్లతో వివిధ ప్యాకేజీలు ప్రకటించింది. గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా జిల్లాలోని ఆధ్యాత్మిక కేంద్రాల సందర్శనలో భాగంగా(రెండు రాత్రులు, ఒక పగలు) అన్నవరం, పిఠాపురం, సామర్లకోట, ద్రాక్షారామం, దిండి, అంతర్వేది, ద్వారకా తిరుమల, విజయవాడ సందర్శనకు పెద్దలకు రూ.4,425, రూ.5,025, పిల్లలకు రూ.3,540, రూ.4,020 టికెట్ ధరగా నిర్ణయించింది. బెంగళూరు నుంచి కూడా.. పర్యాటక శాఖ విజయవాడ, హైదరాబాద్, బెంగళూరు నుంచి కూడా ప్రత్యేక ప్యాకేజీలు రూపొందిస్తోంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖ నుంచి శ్రీశైలానికి(రాత్రి, పగలు/రెండు రాత్రులు, రెండు పగళ్లు) వివిధ ప్యాకేజీల్లో మల్లికార్జున స్వామి దర్శనంతో పాటు రోప్‌వే, సందర్శన స్థలాల వీక్షణం, హరిత హోటల్లో భోజన వసతి సౌకర్యాలు కల్పించనుంది. హైదరాబాద్ నుంచి తిరుపతికి (రెండు రాత్రులు, ఒక పగలు)శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనంతో కూడిన ప్యాకేజీ కూడా తీసుకొస్తోంది. విజయవాడ, బెంగళూరు నుంచి గండికోట(రెండు రోజులు), విజయవాడ నుంచి సూర్యలంక(రాత్రి బస, పగలు వీక్షణం), విజయవాడ నుంచి తూర్పుగోదావరిలోని పిచ్చుకలంకకు ఉదయం బయలుదేరి సాయంత్రానికి చేరుకునేలా.. వేదాద్రి నరసింహస్వామి, ముక్త్యాల ముక్తేశ్వరస్వామి, ముక్త్యాల కోట, తిరుమలగిరి వేంకటేశ్వరస్వామి, పెనుగంచిప్రోలు తిరుపతమ్మ దర్శనాలతో కూడిన ప్యాకేజీలను అందుబాటులోకి తెస్తోంది. ఏపీటీడీసీ వెబ్సైట్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ఆధ్యాత్మిక పర్యాటకాన్ని పెంపొందించేలా.. రాష్ట్రంలో సామాన్యులకు అందుబాటులో ఉండేలా ఆధ్యాత్మిక కేంద్రాలను కలుపుతూ ప్రత్యేక యాత్రలు నిర్వహిస్తున్నాం. హైదరాబాద్, బెంగళూరు నుంచి కూడా పర్యాటకులు వచ్చి వెళ్లేలా ‘వన్డే’ టూర్ ప్లాన్ చేస్తున్నాం. – ఎస్.సత్యనారాయణ, ఏపీటీడీసీ ఎండీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.. పర్యాటకులు రాష్ట్రంలోని శైవక్షేత్రాలు, దేవాలయాలు, సందర్శనీయ స్థలాలను తక్కువ సమయంలో చుట్టివచ్చేలా పర్యాటక ప్యాకేజీలు తీసుకొచ్చాం. అందరూ వీటిని సద్వినియోగం చేసుకోవాలి. – ఆరిమండ వరప్రసాద్‌రెడ్డి, చైర్మన్, ఏపీటీడీసీ -
రా రమ్మని.. రారా రమ్మని...!
పర్యాటక శాఖ సరికొత్త ప్యాకేజీలు ఆన్లైన్లో బుకింగ్ ఏపీ టూరిజం డీఎం వెంకటేశ్వరరావు సాగర్‌నగర్ : దసరా సెలవులు దగ్గర పడడంతో రాష్ట్ర పర్యాటక శాఖ సరికొత్త ప్యాకేజీలను సిద్ధం చేసింది. ఇప్పటికే దేశంలోని ఇతర రాష్ట్రాలకు చెందిన పశ్చిమ బెంగాల్, ఒరిస్సా, చ త్తీస్‌ఘడ్ పర్యాటకులు విశాఖ అందాలను ఆస్వాదించడానికి ఆన్లైన్ బుకింగ్‌లు కోసం ఎగబాకుతున్నారు. దీంతో ఏపీ టూరిజంశాఖ పర్యాటకులకు ఆకట్టుకునేందుకు కొన్ని ప్యాకేజీలను ప్రవేశపెట్టింది. వీటి వివరాలను రాష్ట్ర టూరిజం సెంట్రల్ రిజర్వేషన్ డిప్యూటీ మేనేజర్ పి. వెంకటేశ్వరరావు వివరించారు. అరకు ప్యాకేజీ టూర్ (రైలు కమ్ రోడ్డు) విశాఖపట్నం నుంచి అరకు (వెళ్లేటప్పుడు రైల్లో..వచ్చేటప్పుడు బస్సులో) వెళ్లిరావడానికి పెద్దలకు రూ.875, పిల్లలకు రూ.700లు. విశాఖ రైల్వేస్టేషన్లో ఉదయం ఆరు గంటలకు ట్రైన్ ఎక్కి అరకు చేరుకుంటుంది. అక్కడ ఏపీటూరిజం బస్సులో అరకు పర్యాటక ప్రదేశాలైన పద్మాపురం గార్డెన్స్, ట్రైబల్ మ్యూజియం,అనంతగిరి హిల్స్, కాఫీతోటలు, బొర్రా గుహలను తిలకించవచ్చు. అన్నీ పర్యాటక ప్రదేశాలు ప్రవేశ రుసుం, టిఫిన్, మధ్యాహ్న భోజనం, సాయంత్రం కాఫీ,స్నాక్స్,మినరల్ వాటర్ బాటిల్స్ ఇస్తారు. వైజాగ్ నైట్ లీజర్‌కు.. సాయంత్రం ఖాళీ సమయంలో నగర పర్యాటక ప్రదేశాలను వీక్షించే పర్యాటకుల కోసం వైజాగ్ నైట్ లీజర్ ప్యాకేజీ టూర్‌ను ప్రకటించింది. సాయంత్రం 4 నుంచి రాత్రి 9.30 గంటల వరకు ఉంటుంది. బోట్ ఫిషింగ్ హార్బర్, సబ్‌మెరైన్ మ్యూజియం, కైలాసగిరి, శిల్పారామం, రుషికొండ బీచ్ రిసార్ట్స్‌లో డిన్నర్. ప్రవేశ రుసుము కలుపుకుని ప్యాకేజీ ఉంటుంది. పెద్దలకు రూ. 400, పిల్లలకు రూ. 300లు. ఇతర సమాచారం కోసం డిప్యూటీ మేనేజర్ సెల్ నంబర్లో 98480 07022 సంప్రదించవచ్చు. బై రోడ్డు ప్యాకేజీ విశాఖ నుంచి దట్టమైన అడవుల మధ్యలో పాము మెలికలు తిరిగేలా ఘాట్ రోడ్డుపై బస్సులో ప్రయాణం అద్భుతంగా ఉంటుంది. ఇలాంటి పర్యాటకుల కోసం బై రోడ్డుపై ఒక్కరోజు ప్యాకేజీని కేటాయించారు. పెద్దలకు రూ. 1130,పిల్లలకు రూ.900లు. ఉదయం ఏడు గంటలకు బయలు దేరి రాత్రి తొమ్మిది గంటలకు తిరిగి విశాఖ చేరుకుంటారు. మినరల్ వాటర్, లంచ్, సాయంత్రం కాఫీ, స్నాక్స్ ఇస్తారు. అరకులో పద్మాపురం గార్డెన్స్, బొర్రా రైల్వేస్టేషన్, బొర్రా గుహలు, కటిక జలపాతం, అరకు గిరిజన మ్యూజియాన్ని సందర్శించవచ్చు. ప్రవేశం ఉచితం. వైజాగ్ సిటీ టూర్ నగరంలోని పర్యాటక పర్యాటక ప్రదేశాలను వీక్షించేందుకు ఒక రోజు సిటీ టూర్‌ను ప్యాకేజీని ప్రకటించారు. పెద్దలకు రూ. 475, పిల్లలకు రూ. 380(3-10 వయస్సు) సెంట్రల్ రిజర్వేషన్ ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి ఉదయం తొమ్మిది గంటలకు బయలు దేరి సింహాచలం, కైలాసగిరి, తెలుగు మ్యూజియం, జాతర శిల్పారామం (మధురవాడ),తొట్లకొండ, పిషింగ్ హార్బర్, బోట్ షికార్, రుషికొండ బీచ్, రామానాయుడు స్టూడియో, విశాఖ మ్యూజియం, సబ్‌మెరైన్ మ్యూజియం,విశాఖ మ్యూజియం వంటి ప్రదేశాలు తిలకించవచ్చు. సాయంత్రం 5.30 గంటలకు బయలు దేరి ప్రదేశంలోనే దింపుతారు. ఇదే టూర్ ఏసీ బస్సుల్లో అయితే పెద్దలకు రూ.600, పిల్లలకు రూ.500లు శాఖహార భోజనం అందిస్తారు.