‘పట్టుకో’లేవు..!
- పర్యాటక హోటళ్లలో ఇంటి దొంగలు
- హోటల్ ప్లాజాలో రూ.లక్షల్లో నగదు స్వాహా
- హరిత హోటళ్లలో దొంగ బిల్లులతో కన్నం
- సీఎం పాల్గొన్న టీఆర్ఎస్ శిక్షణ శిబిరంలోనూ..
- ఆదాయం తగ్గి హోటళ్లు మూసేయాల్సిన దుస్థితి
సాక్షి, హైదరాబాద్: అది హైదరాబాద్లో పర్యాటక శాఖ నిర్వహిస్తున్న స్టార్ హోటల్.. ఓ వ్యక్తి తన కూతురి పుట్టినరోజు వేడుకను ఘనంగా నిర్వహించాడు.. బిల్లు రూ.లక్ష రాగా కొంత మొత్తం నగదు రూపంలో, మిగిలిన మొత్తాన్ని క్రెడిట్ కార్డు ద్వారా చెల్లించాడు.. కానీ హోటల్ బ్యాంకు ఖాతాలో డబ్బు జమ కాలేదు. మరి ఏమైందనుకుంటున్నారా.. సిబ్బంది జేబులోకి వచ్చిపడింది. రెండేళ్లుగా ఈ తంతు జరుగుతున్నా అధికారులకు అను మానం రావడం లేదు. వినియోగదారులు చెల్లించిన నగదులో కొంత పక్కదారి పడుతోంటే చీమకుట్టినట్టయినా అనిపించడం లేదు. హరిత పేరుతో పర్యాటక శాఖ నిర్వహిస్తున్న హోటళ్లలోనూ ఇదే పరిస్థితి. ఖాళీ బిల్లుల తో సిబ్బందే డబ్బులు స్వాహా చేస్తున్నారు.
బిల్లింగ్ సెక్షన్ నుంచి..
బేగంపేటలో ప్లాజా పేరుతో పర్యాటక శాఖకు సొంతంగా స్టార్ హోటల్ ఉంది. నెలకు రూ.95 లక్షల వరకు ఆదాయం వస్తుండగా, ఖర్చులు పోను రూ.20 లక్షల వరకు లాభం తెచ్చిపెడుతున్న ఈ హోటల్ ఇప్పుడు ఇంటి దొంగలకు నిలయమైంది. రెండేళ్లుగా కొందరు ఉద్యోగులు రూ.లక్షల్లో నగదు మాయం చేస్తున్నారు. వినియోగదారులు నగదు రూపం లో బిల్లు చెల్లించినప్పుడు హస్తలాఘవం చూపుతున్నారు. బిల్లులను పరిశీలించాల్సిన అకౌంట్స్ విభాగం నిద్రపోతోంది. ప్రధాన కార్యాలయం నుంచీ తనిఖీలు జరగటం లేదు. ఇంత జరుగుతున్నా అధికారులు గుర్తించక పోవటం అనుమానాలకు తావిస్తోంది.
వరంగల్ హరిత హోటల్లో..
వరంగల్ జిల్లాలోని ఓ హరిత హోటల్ సిబ్బంది ఓ ప్రైవేటు సంస్థ పేరుతో బిల్ బుక్ దగ్గర పెట్టుకుని కూరగాయలు, చికెన్ ఇతర వస్తువుల పేరుతో బిల్లులు సృష్టించి నగదు మాయం చేస్తున్నారు. మిగిలిన హోటళ్లలోనూ ఇదే స్థితి. దీంతో ఆదాయం కంటే ఖర్చులు పెరిగాయని, ఈ క్రమంలో సిబ్బంది సంఖ్యను తగ్గించేశారు. ఫలితంగా హోటళ్లలో సరైన సేవలందక వాటి ఖ్యాతి దిగదుడుపు అవుతోం ది. కొన్ని చోట్ల హోటళ్లనే మూసేయాల్సిన దుస్థితి నెలకొంది. ఈ ఇంటి దొంగల వ్యవహా రంపై ఇటీవల కొందరు ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చింది.