‘బ్యాంకు’ వలలో ‘బడా’ బాబులు
ఇటీవల ప్రపంచ పర్యాటకుల్లో ‘బడా’ టూరిస్టుల జాబితాలో చేరిన ముగ్గురు మన దేశీయ పాలకులు - ప్రధాని మోదీ, ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్ కొత్తగా పదవుల్లోకి వచ్చింది లగాయతూ ‘ప్రపంచ బ్యాంకు’ జపంలోనూ, ప్రజా సమస్యల పరిష్కార దిశ నుంచి పక్క తోవలు పట్టి ‘భారీ’ పెట్టుబడుల కోసం బడా టూరిస్టులు’గా నమోదయ్యారు! ఇందులో ఒకరు ‘వాస్కోడిగామాలై తరలిరమ్మ’ని బహుళజాతి సంస్థలకు పిలుపునిచ్చి ‘మేడిన్ ఇండియా’కు గందరగోళపు అర్థాన్ని నినాద రూపంలో ప్రతిపాదించారు.
‘‘ఒక దేశాన్ని జయించాలన్నా, లోబర్చుకోవాలన్నా రెండే రెండు మార్గాలు - 1. సాయుధ శక్తి ద్వారా ఆ దేశ ప్రజల్ని అదుపులోకి తెచ్చుకోవటం లేదా 2. ధనబలం ద్వారా ద్రవ్యనియంత్రణ ద్వారా ఆ దేశ ఆర్థికవ్యవస్థ పెత్తనం సాధించటం’’
- అమెరికా మాజీ విదేశాంగ మంత్రి జాన్ఫాస్టర్ డల్లెస్.
‘‘మీసాలకు సంపెంగ నూనె అవసరం’’ ఎవరికి కలుగుతుంది? అదొక సామెతలా మన ఆచార వ్యవహారాల్లోకి ఎలా చొచ్చుకువచ్చింది? డాబు కబుర్లు చెప్పేవాళ్లకోసం, ‘గప్పాలు’ కొట్టే వాళ్లకోసం ఆ సామెత పుట్టింది. ఒక వైపున నిత్యం ‘అడుక్కుతినే’ బతుకులు, ఇంకో వైపున ఎచ్చులుపోతూ ఇత రుల నుంచి మెరమెచ్చుల కోసం ‘‘మీసాలకు మాత్రం సంపెంగ నూనె’’ పూసుకుని తిరిగే వాళ్లను అలా అంటూంటారు!
ఆంగ్లో-అమెరికన్, ఇతర ప్రధాన యూరోపియన్ పాత, కొత్త సామ్రా జ్యపాలనా వ్యవస్థలు నూతన స్వతంత్ర దేశాల ఆర్థికవ్యవస్థలను బలహీన పరచి, 21వ శతాబ్దంలో కూడా తమ దోపిడీని కొనసాగించుకోడానికి ప్రపం చబ్యాంకును ఒక పనిముట్టుగా వాడుకుంటున్నాయి; ఎన్నో త్యాగాలతో పాత వలస, అర్ధవలస దేశాల ప్రజలు సాధించుకున్న స్వాతంత్య్రాన్ని కూడా తిరిగి మింగివేసే ప్రయత్నంలో రకరకాల ఎత్తుగడలు, వ్యూహాలు పన్నుతున్నాయి; ఆంగ్లో-అమెరికన్ సామ్రాజ్యపాలనా వ్యవస్థలు తమ దేశాలలోని, ఇతర దేశా లలోని సామాన్య ప్రజాబాహుళ్యాన్ని నిరంతర దోపిడీకి గురిచేస్తూనే, ఇతర దేశాల ప్రజలపైన, సంపదపైన పాత ఆధిపత్యం కొనసాగించుకుంటూనే ఆర్థిక సంక్షోభాల్ని వాయిదా వేసుకుంటున్నాయిగాని, పరిష్కరించుకోలేక పోతున్నాయి. పైగా ఆ సంక్షోభాల పరిష్కారం కోసం వర్ధమాన దేశాల ఆర్థిక వ్యవస్థలను ‘సహాయం’ పేరిట మరింతగా కుంగదీస్తున్నాయి.
ఇందుకు అమెరికా సామ్రాజ్యపాలకుల చేతి ఎత్తుబిడ్డగా ‘ప్రపంచ బ్యాం కు’ పనిచేస్తోందన్నది అర్ధసత్యం కాదు, సంపూర్ణమైన వాస్తవం! వర్ధమాన దేశాల ‘పారిశ్రామికీకరణ’, వాటి ‘అభివృద్ధి’ తమ ధ్యేయమని ఎన్ని కబుర్లు చెప్పినా బ్యాంకు-1956 నుంచీ పెట్టుకున్న ఎజెండా మాత్రం.. బహుళజాతి గుత్త సంస్థల పెట్టుబడుల ద్వారా వర్ధమాన దేశాల ఆర్థిక వ్యవస్థలను తమకు పోటీగా ఎదగకుండా నియంత్రించేందుకే ప్రజావ్యతిరేక ‘సంస్కరణ’లతో దూసుకువచ్చింది. 1984 నాటికే ఈ వాస్తవం బట్టబయలైంది.
ఇండియా లాంటి వర్ధమాన దేశాలు 60 ఏళ్ల తర్వాత కూడా శరవేగాన ఎదిగిరాకుండా, తమకు పోటీగా నిలబడకుండా ఈ దేశాలు క్రమంగా అస్థి రత వైపు జారుకునేలా పన్నిన కుట్ర - ఎప్పటికప్పుడు పూర్తిస్థాయి యుద్ధాలు లేదా ఘర్షణలు కాకుండా పరిమితస్థాయిలో ఘర్షణలను (‘లో-ఇంటెన్సిటీ కాన్ఫ్లిక్ట్స్’) సృష్టించడం. ఇది సామ్రాజ్య దురాక్రమణ వ్యూహంలో తొలి మెట్టు! ‘తాటితోనే దబ్బనం’ అన్నట్టుగా అదే సమయంలో ‘పరిమిత సంక్షేమ పథకాల’ను (‘లిమిటెడ్ వెల్ఫేర్), ‘పరిమిత యుద్ధతంత్రం’లో భాగం చేయ టమూ! స్థానిక పెట్టుబడి ప్రభుత్వాలలో అధికార కుమ్ములాటల నుంచి పుట్టు కొచ్చే ‘తిరుగుబాటు’ గ్రూపుల తోడ్పాటుపైన ఈ నయా వలస సామ్రాజ్య దురాక్రమణ వ్యూహం ఆధారపడుతూ వచ్చింది. అమెరికన్ల సలహాలను ఆమోదించని దేశాలనూ, దేశాధినేతలనూ స్థానిక తిరుగుబాట్ల ద్వారా అస్థి రత వైపు నెట్టేస్తున్నారు లేదా ఆ ప్రయత్నంలో పల్టీలు కొడుతున్నారు.
ఇందుకు నిదర్శనంగా ప్రపంచ బ్యాంకు ఇండియాలో బహుళజాతి గుత్త పెట్టుబడులను మరింత విస్తృతస్థాయిలో కేంద్రీకరించడం కోసం, ఆ లక్ష్యాన్ని చేరడానికి అనుగుణంగా ఇండియా ఆర్థికపరిస్థితిపై అంచనాలను ‘సర్వే’ పేరి ట ఒకసారి దేశానికి అనుకూలంగానూ, మరొకసారి ప్రతికూలంగానూ రేటిం గ్లు విడుదల చేస్తోంది! స్థానిక ప్రభుత్వాధినేతలు-ప్రభుత్వరంగ వ్యవస్థను నిర్వీర్యం చేసి, బ్యాంకు ‘సంస్కరణల’ తాఖీదుల ప్రకారం ప్రభుత్వ-ప్రైవేట్ కంపెనీ లిమిటెడ్‌గా ఆర్థిక వ్యవస్థను మలుస్తున్నారు. ప్రభుత్వాలను ‘బ్రోకర్ల’ స్థాయికి దిగజార్చింది బ్యాంకు!
ముఖ్యంగా 1991లో బ్యాంకు ప్రజావ్యతిరేక సంస్కరణలపై కాంగ్రెస్ ప్రభుత్వం బేషరతు సంతకాలు పడిన తర్వాత, బీజేపీ వాజ్‌పేయి ప్రభుత్వం మరింతగా ఆ సంస్కరణలను భుజాన వేసుకున్న తరువాత బ్యాంకుకూ దాని పోషకులైన నయా వలస పాలనావ్యవస్థలకూ అడ్డూఅదుపూ లేదు. ఇటీవల ప్రపంచ పర్యాటకుల్లో ‘బడా’ టూరిస్టుల జాబితాలో చేరిన ముగ్గురు మన దేశీయ పాలకులు - ప్రధాని మోదీ, ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్ కొత్తగా పదవుల్లోకి వచ్చింది లగాయతూ ‘ప్రపంచ బ్యాంకు’ జపంలో మునిగి ‘భారీ’ పెట్టుబడుల కోసం బడా టూరిస్టులు’గా నమోదయ్యారు! ఇందులో ఒకరు ‘వాస్కోడి గామా’లై తరలిరమ్మంటూ ప్రపంచ కీర్తిపొందిన దేశీయ వృత్తిదార్లను, సాంకేతిక నిపుణులను, శాస్త్రవేత్తలను విస్మరించి, ‘మేడి న్ ఇండియా’కు గందరగోళపు అర్థాన్ని నినాద రూపంలో ప్రతిపాదించారు.
నిజానికి ఈ రకమైన దారి తప్పిన ప్రయోగాలను వరల్డ్ బ్యాంకు ద్వారా ఇంతకుముందే - 1984 నాటికే ఆఫ్రికా, లాటిన్ అమెరికాలలో ప్రవేశపెట్టిం చి, వాటి సహజమైన స్థానికవృత్తులను, పంటలను దెబ్బతీసి, అమెరికా తన ఉత్పత్తుల దిగుమతులపైన ఆధారపడే దుర్మార్గపు పరిస్థితిని కల్పించింది. ‘అప్పు తీసుకున్నప్పుడే చెప్పుచేతల్లో ఉండా’ల్సిన పరిస్థితి వచ్చింది! ఈ జాబితాలోకి మొరాకో, ఇథియోపియా, సైప్రస్, పెరూ, కొలంబియా, జమై కా, మెక్సికో, బంగ్లాదేశ్, అర్జెంటీనా, ఇత్యాది 108 దేశాలు చేరి, దారుణ స్థితికి వెళ్లాయని మరవరాదు! దేశ సంపదను దోచుకునే సంప్రదాయంలో మొదట బ్రిటిష్ సామ్రాజ్య పాలకులూ, నేడు అమెరికన్ పాలనా వ్యవస్థా.. ప్రపంచ బ్యాంకు చాటున దాగి భారత ఆర్థిక వ్యవస్థను తారుమారు చేస్తున్నారు.
ఇందులో తమకు అక్షర సత్యంగా తోడ్పడుతున్న వారికి కితాబు లేదా ‘నజరానా’ను అందిస్తూ తమ పెట్టుబడుల వృద్ధికి అత్యంత అనుకూల రాష్ట్రా లుగా గుజరాత్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు ప్రపంచ బ్యాంకు 98 రకాల సంస్కరణల ఎజెండాను ప్రకటించింది. మోదీ, చంద్రబాబు, కేసీఆర్‌ల పాల నలో సాధించిన అభివృద్ధికి ప్రథమ (గుజరాత్), ద్వితీయ (ఆంధ్రప్రదేశ్), తృతీయ (తెలంగాణ) స్థానాలను రేటింగ్ ప్రకటించింది! అమెరికా మాజీ అధ్యక్షుడు గెరాల్డ్ఫోర్డ్ ‘లెక్కల్ని తారుమారు చేయడం ప్రభుత్వాల చేతిలో పని’’ అన్నాడట! ఈ వరసలో ఎందుకైనా మంచిదని బీజేపీ పాలనలో ఉన్న ఛత్తీస్‌గఢ్‌ను, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలనూ పేర్కొన్నది.
వ్యాపార ప్రయోజనాలకు అనువైన వాతావరణాన్ని మోదీ ప్రధాని కాక ముందే గుజరాత్ సీఎం హోదాలో అహ్మదాబాద్‌లో ప్రత్యేకించి సృష్టించారు. మోదీ వచ్చిన తర్వాత దేశ పారిశ్రామిక, వ్యవసాయక, ప్రజాసంక్షేమ పథకా లు, అందుకు చెందిన విధానాలూ దాదాపు 180 డిగ్రీలలో తారుమారవుతూ వస్తున్నాయి. బ్యాంకు దృష్టిలో అంత ‘వృద్ధి’ నమోదై ఉంటే పెట్టుబడులు గుప్పించాలన్న తాపత్రయం బ్యాంకుకి ఎందుకో?! ప్రణాళికా సంఘం రద్ద యింది, ప్రభుత్వరంగానికి తలమానికంగా ఉన్న ‘నవరత్న పరిశ్రమల్ని’ కాస్తా కళాకాంతులు లేని సంస్థలుగా దిగజార్చారు. ఆహార భద్రతకు అవస రమైన ప్రభుత్వ ధాన్యసేకరణ విధానం పతన దశలోకి చేరుకుంటోంది; విదే శాంగ విధానం అలీన విధానం నుంచి పూర్తిగా దూరమవుతూ ఇరుగు పొరు గు దేశాలతో సత్సంబంధాలకు విరుగుడుగా, ఆంగ్లో-అమెరికన్- ఇజ్రాయిలీ మైత్రీ బంధం బిగుసుకునే పద్ధతిలో ముందుకు సాగుతోంది!
చంద్రబాబు తొలి 9 సంవత్సరాలలో వరల్డ్ బ్యాంకుతో ప్రారంభమైన చెట్టాపట్టాలు ఇప్పటి ఆంధ్రప్రదేశ్ పాలనలో కూడా కొనసాగడం గమనార్హం. కేంద్రంలో జేపీ-ఆర్ఎస్ఎస్-ఎన్డీయే సర్కారు సహకార ఫెడరల్ వ్యవ స్థకు చెల్లు చీటీ ఇచ్చి, రాష్ట్రాల నిర్వహణలో జోక్యానికి తెరతీస్తూ సమాచార హక్కు చట్టానికి తూట్లు పొడవడానికి బొక్కలు వెతుకుతోంది! ఇందుకోసం మోదీ, చంద్రబాబు, కేసీఆర్‌లు దేశ ప్రజల్ని ఒక అనుకూలమైన నిర్ణయం కోసం, ‘భవిష్యత్ పెట్టుబడి’గా ఒక డిమాండ్ పెడుతున్నారు - ముగ్గురూ 2019 నాటికి ఇంకా కలిసొస్తే మరో ఐదేళ్లకు అంటే 10 ఏళ్లకూ, అవసరాన్ని బట్టి మరి 20 ఏళ్లకూ సరిపడా పాలనా పగ్గాలు తమకు అందించాలని! ఆశకు మితం ఉండాలి; ప్రజల ఆశలు, కష్టాలూ తీరేవికావు!
(వ్యాసకర్త మొబైల్: 9848318414)
- ఏబీకే ప్రసాద్
సీనియర్ సంపాదకులు