‘ఆ రెండు మ్యాచ్‌లు నిర్వహిస్తాం’
ముంబాయి: తొలి సీజన్ నుంచి ప్రొ కబడ్డీ అనూహ్య ఆదరణతో దూసుకుపోతోంది. ముంబాయిలో వరదల కారణంగా మొదలు కాకుండానే రెండు ప్రొ కబడ్డీ లీగ్ మ్యాచ్‌లు ఆగిపోయ్యాయి. కానీ ఆ రెండు మ్యాచ్‌లను రాంచీ, పూణెలలో నిర్వహిస్తామని టోర్నమెంట్ నిర్వహకులు బుధవారం తెలిపారు. కొత్త షెడ్యూల్ ప్రకారం బెంగుళూరు బుల్స్, యూపీ యోధ మధ జరగాల్సిన మ్యాచ్‌ను సెప్టెంబర్ 20న రాంచీలోని హరివంశ్ తానా భగత్ ఇండోర్ స్టేడియంలో జరుగుతుందన్నారు.
అలాగే యూ ముంబా, గుజరాత్ ఫార్చూన్ జైంట్స్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ అక్టోబర్ 17న పూణెలో శ్రీ శివ్ చత్రపతి స్పోర్ట్స్ కాంపెక్స్‌లో నిర్వహిస్తామని చెప్పారు. ఈ రెండు మ్యాచ్‌లు ముంబాయిలో వచ్చిన అకాల వరదల కారణంగా జనజీవనం స్ధంబించిపోవడంతో ఆగిపోయిన విషయం తెలిసిందే.
తొలి సీజన్ నుంచి అనూహ్య ఆదరణతో దూసుకెళుతున్న ప్రొ కబడ్డీ లీగ్‌లో ఈసారి ప్రైజ్‌మనీ కూడా భారీగా పెరిగింది. గత సీజన్లో రూ.6 కోట్లుగా ఉన్న ఈ మొత్తం ఈసారి రూ. 8 కోట్లకు పెరిగింది. విజేతగా నిలిచిన జట్టు రూ.3 కోట్లు దక్కించుకుంటుంది. రన్నరప్‌కు రూ. కోటీ 80 లక్షలు లభిస్తాయి. మూడో స్థానం పొందిన జట్టుకు రూ. కోటీ 20 లక్షలు అందజేస్తారు. ‘అత్యంత విలువైన ఆటగాడు’ అవార్డు పొందిన వారికి రూ.15 లక్షలు దక్కుతాయి. ఓవరాల్‌గా లీగ్‌లో 12 జట్ల మధ్య 138 మ్యాచ్‌లు జరుగుతాయి. అక్టోబరు 28న ప్రొ కబడ్డీ ఫైనల్ జరుగుతుంది.