గోవిందు ఆత్మహత్య చేసుకున్నాడా?
ముదినేపల్లి రూరల్, న్యూస్‌లైన్ : మండలంలోని చిగురుకోటలో ఈనెల 12న గుబ్బల గోవిందు మృతి చెందిన ఘటనపై నమోదైన కేసు మలుపులు తిరుగుతోంది. ప్రేమించిన యువతి బంధువులే గోవిందును హత్య చేసినట్లు మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపించారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు హత్యకేసుగా నమోదు చేసి, ఆ దిశగా దర్యాప్తు చేస్తూ వస్తున్నారు. విష పదార్థం కారణంగానే గోవిందు మరణించినట్లు పోస్టుమార్టం నివేదికలో డాక్టర్లు పేర్కొన్నట్లు తెలిసింది. ఈ నివేదిక ఆధారంగా మరిన్ని కోణాల్లో దర్యాప్తు చేయవచ్చని భావించిన పోలీసులకు దీంతో నిరాశే ఎదురైంది. రిపోర్టులో పేర్కొన్న విషపదార్థం గుళికలు కావచ్చని భావిస్తున్నారు.
ఈ నివేదికపై పలువురిలో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గోవిందు మృతదేహాన్ని చూసినవారెవరికీ ఇలాంటి అనుమానం రాలేదు. మృతదేహం పడి ఉన్న ప్రదేశంలోనూ, పరిసరాల్లో విష పదార్థం ఏదీ లభ్యం కాలేదు. మృతదేహం నుంచి అలాంటి వాసన రాలేదు. మర్మావయవాలను గాయపరిచినందువల్లే మరణించి ఉంటాడని అందరూ భావించారు. దీనికి తోడు పోలీసు జాగిలాలు సంచరించిన తీరును బట్టి కూడా హత్యగా అనుమానించారు. ఈ కారణాల వల్లనే హత్య కేసుగా పోలీసులు నమోదు చేశారు.
ఇందుకు విరుద్ధంగా పోస్టుమార్టం నివేదిక రావడంతో దీనిపై సందేహాలు తలెత్తుతున్నాయి. హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు కొంతమంది నాయకులు వైద్యులపై ప్రభావం చూపి నివేదికను తారుమారు చేసినట్లు గోవిందు బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలను పోలీసు వర్గాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ముగ్గురు వైద్యుల బృందం పోస్టుమార్టం చేసినందున ఎవరూ ప్రభావితం చేసే అవకాశం లేదని వారు స్పష్టం చేస్తున్నారు. గోవిందు మృతదేహం వద్ద ఉన్న సెల్‌ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
మృతిచెందే ముందు గోవిందు తాను ప్రేమించిన యువతికి ఆత్మహత్య చేసుకుంటున్నట్లుగా ఫోన్ ద్వారా సందేశం పంపినట్లు పోలీసులు గుర్తించారు. ఇది నిజంగా గోవిందు పంపిన సందేశమా? లేక హత్యకు పాల్పడ్డ వ్యక్తులే దానిని పంపి ఉం టారా? అనేది చర్చనీయాంశంగా మారింది. మృతుడి శరీరంలోని భాగాలను హైదరాబాద్‌లోని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. ఇక్కడ నుంచి వచ్చే నివేదిక లో పూర్తి వాస్తవాలు వెలుగు చూస్తాయని భావిస్తున్నారు. ఏదేమైనప్పటికీ అందరూ హత్యగా భావించిన గోవిందు కేసు ఈవిధంగా మలుపు తిరగడం స్థానికంగా తీవ్ర చర్చనీ యాంశమైంది.