దోచేస్తున్నారు!
ధరల పెరుగుదలను సాకుగా చూపి మద్యం వ్యాపారులు నిలువు దోపిడీ చేస్తున్నారు. పాత మద్యాన్ని కొత్త ధరలకు విక్రయిస్తూ కస్టమర్లకు చుక్కలు చూపుతున్నారు. దీంతో ధరల విషయంలో ప్రతిరోజు దుకాణాల వద్ద గొడవలు జరుగుతున్నాయి. అయినా, ఎక్సైజ్ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
సిద్దిపేట రూరల్: జిల్లాలో 67 మద్యం దుకాణాలు, 6 బార్లు ఉన్నాయి. గతేడాది డిసెంబర్ 3వ తేదీన ప్రభుత్వం మద్యం ధరలను పెంచింది. దీంతో వ్యాపారులు పాత మద్యాన్ని కొత్త ధరలకు విక్రయిస్తున్నారు. బ్రాండెడ్ కంపెనీ క్వార్టర్ బాటిల్‌పై రూ.5నుంచి రూ.10వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. ఈ క్రమంలో కొందరు వినియోగదారులు వ్యాపారులతో వాగ్వాదానికి దిగుతున్నారు. జిల్లాలోని అన్ని దుకాణాల వద్ద ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ధరలు పెరిగిన తర్వాత వాటి వివరాల పట్టికలు దుకాణాలకు చేరకముందే మద్యాన్ని పెంచిన ధరలకు అమ్మడం ప్రారంభించారు.
నెలవారీ మామూళ్లు రూ.10లక్షల పైనే..
జిల్లాలోని మద్యం దుకాణాలు, బార్ల నుంచి అధికారులకు నెలవారీ మామూళ్లు దాదాపు రూ.10 లక్షలకు పైగా ముడుతున్నట్టు సమాచారం. ఒక్కో మద్యం దుకాణం ద్వారా పోలీసులకు రూ.10వేలు, ఎక్సైజ్ పోలీసులకు రూ.6వేల చొప్పున ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇక పండగల సందర్భంగా ఖరీదైన మద్యం బాటిళ్లను అధికారులకు ఇస్తున్నట్టు తెలిసింది. ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులకూ ఆరు నెలలకు ఒకసారి ప్రత్యేక మామూళ్లు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
పాతస్టాక్పై కొత్త రేట్లు..
ధరల పెరుగుదలకు ముందే తయారైన బాటిళ్లపై పాత ధరే ఉంటుంది. ఆ సీసాలపైనే పెరిగిన ధర స్టాంప్ వేసి ముద్రించలేదు. అయితే, మద్యం వ్యాపారులు అధిక ధరలకు అమ్ముతున్నట్లు తెలుస్తోంది. ఇలా ఎవరైనా అమ్మితే మా దృష్టికి తీసుకోస్తే చర్యలు తీసుకుంటాం.
విజయ్‌భాస్కర్‌రెడ్డి, జిల్లా ఎక్సైజ్ సూపరిండెంట్