బడ్జెట్లో నో ఎల్బీటీ
- స్పష్టం చేసిన మంత్రి గిరీష్ బాపట్
- పరిశ్రమలు, వ్యాపారుల సమస్యలు పరిష్కరిస్తామని వెల్లడి
పింప్రి, న్యూస్‌లైన్: వ్యాపారుల ఆర్థిక సమస్యల దృష్ట్యా ఈ సారి బడ్జెట్లో స్థానిక సంస్థల పన్ను (ఎల్బీటీ) ఉండదని, భవిష్యత్తులో కూడా దీని ప్రస్తావన ఉండదని పౌర సరఫరాల శాఖ మంత్రి గిరీష్ బాపట్ స్పష్టం చేశారు. పింప్రి-చించ్వడ్ చాంబర్ ఆఫ్ ఇండస్ట్రీస్ కామర్స్, సర్వీసెస్ అండ్ అగ్రికల్చరల్ ఆధ్వర్యంలో గురువారం ఆటో క్లస్టర్ సభా గృహంలో ‘మేక్ ఇన్ మహారాష్ట్ర-మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుణే నగరంలో పరిశ్రమలకు, వ్యాపారుల సమస్యలను తొలగించేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. ఎంఐడీసీలో పరిశ్రమల, వ్యాపార మేళాలు ప్రారంభిస్తామని, అందులో వారు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించవచ్చని అన్నారు. విద్యుత్, అగ్నిమాపక కేంద్రాలు సహా 50 రకాల సమస్యలు గుర్తించామని, వీటిలో కీలక సమస్యల్ని వచ్చే ఏడాదిలోగా పరిష్కారిస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమానికి మాజీ ఎంపీ గజానన్ బాబర్, పింప్రి-చించ్వడ్ చాంబర్ ఆఫ్ ఇండస్ట్రీజ్, కామర్స్, సర్వీసెస్ అండ్ అగ్రికల్చరల్ అధ్యక్షుడు, అడ్వొకేట్ అప్పాసో షిందే, ఉపాధ్యక్షుడు ప్రేమ్‌చంద్ మిత్తల్, సభ్యులు సురేశ్ వాడేకర్, వినోద్ బన్సల్, పింప్రి-చించ్వడ్ పరిశ్రమల సంఘటన అధ్యక్షుడు నితిన్ బన్కర్ తదితరులు హాజరయ్యారు.