‘వాణిజ్యం’ బలోపేతం
సాక్షి, చెన్నై:రాష్ర్ట ప్రభుత్వానికి ఆదాయం చేకూర్చే విభాగాల్లో వాణిజ్య పన్నుల శాఖ కూడా ఒకటి. ఈ విభాగాన్ని మరింత పటిష్టవంతం చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. చెక్ పోస్టుల ఆధునికీకరణ, పన్నులు ఎగవేసే వారి భరతం పట్టే విధంగా కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. అలాగే, అనేక చోట్ల ఈ విభాగ కార్యాలయాలు అద్దె భవనాల్లో నడుస్తున్నాయి. దీన్ని పరిగణనలోకి తీసుకున్న సీఎం జయలలిత పక్కా భవనాల నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు. పక్కా భవనాలు: సేలంలో డివిజన్ కార్యాలయాన్ని 9 కోట్ల వ్యయంతో, తిరువణ్ణామలైలలో రూ.కోటి 40 లక్షలతో, విల్లుపురంలో రూ.రెండు కోట్లతో, తిరుచ్చిదిలో రూ.రెండు కోట్లతో, బన్రూటిలో కోటి యాభై లక్షలతో, మైలాడుతురైలో రూ.2.3 కోట్లతో, ఈరోడ్‌లో రూ. కోటి యాభై లక్షతో అత్యాధునిక వసతులతో వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయాలు, శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేశారు. లాల్గుడి, కోవిల్ పట్టిల్లోనూ ప్రత్యేకంగా భవనాలను నిర్మించారు.
తిరువళ్లూరు జిల్లా పుళల్ చెక్ పోస్టును రూ.20 లక్షలతో ఆధునీకరించారు. మొత్తంగా రూ.23 కోట్ల వ్యయంతో నిర్మించిన భవనాల్ని ఆదివారం సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం జయలలిత ప్రారంభించారు. ఈ శాఖను మరింత బలోపేతం చేయడం లక్ష్యంగా కొన్ని ప్రకటనలు చేశారు. మరో రెండేళ్లలో ఆ పనుల్ని పూర్తి చేయనున్నారు. సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలు: వీర పాండి, జలగండం, కోవిల్ పట్టి, తిరుత్తంగల్, తిరుపూండి, పరమత్తి వేలూరు తదితర 18 చోట్ల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు పక్కా భవనాలు నిర్మించారు. రూ.9కోట్ల వ్యయం తో నిర్మించిన ఈ భవనాలను సీఎం జయలలిత వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. రానున్న రెండేళ్లల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడ అద్దె భవనాల్లో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయో వాటన్నింటికీ పక్కా భవనాలు నిర్మిస్తామని ఈ సందర్భంగా ప్రకటించారు.
ఆన్లైన్లో దస్తావేజులు: స్థలం మోసాల కట్టడి లక్ష్యంగా, ప్రజలకు అండగా నిలబడే విధంగా ఆన్లైన్లో దస్తా వేజుల వివరాలను పొందు పరిచారు. ఎవరైనా స్థలం కొనుగోలు చేయదలచిన పక్షంలో ఆ స్థలానికి సంబంధించిన పూర్తి వివరాలు(ఈసీ) ఉచితంగా ఆన్లైన్లో పొందవచ్చు. ఇప్పటికే స్థలాల రిజిస్ట్రేషన్లను పూర్తి స్థాయిలో కంప్యూటరీకరించారు. అలాగే, సీడీల రూపంలో దస్తావేజుల వివరాలు సైతం అందిస్తున్నారు. ఇక, స్థలాల రిజిస్ట్రేషన్లు సులభతరం కావడంతో, స్థలాల వివరాలను ముందుగా కొనుగోలుదారులు తెలుసుకునేందుకు వీలుగా ఆన్లైన్ సేవలకు నిర్ణయించారు. ఆన్లైన్లో దస్తావేజులు, స్థలాల వివరాలను తెలుసుకునే ఈ ప్రక్రియకు ఉదయం సీఎం జయలలిత శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో వాణిజ్య పన్నుల శాఖ మంత్రి ఎంసీ సంపత్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మోహన్ వర్గీస్, సలహాదారు షీలా బాలకృష్ణన్ తదితరులు పాల్గొన్నారు.