హెలికాప్టర్లతో ట్రాఫిక్ పర్యవేక్షణ
న్యూఢిల్లీ: దేవీశరన్నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా తలెత్తే ట్రాఫిక్ సమస్యలను నివృత్తి చేసేందుకు ఢిల్లీ పోలీసులు సరికొత్త ఐడియాను అమలుచేశారు. ఫలితం సంగతి ఎలా ఉన్నప్పటికీ శుక్రవారం నాటి దుర్గామాత విగ్రహాల నిమజ్జన కార్యక్రమానికి హెలికాప్టర్ల సహాయం తీసుకున్నారు. ట్రాఫిక్ నియంత్రణకు హెలికాప్టర్లను వినియోగించడం దేశరాజధానిలో ఇదే ప్రథమం.
'యమునా నదికి దారితీస్తూ సాగే నిమజ్జనయాత్రను.. ఆకాశమార్గం నుంచి పరిశీలిస్తూ, ఎక్కడెక్కడ ట్రాఫిక్ జామ్ అయిందో, దానిని ఎలా కంట్రోల్ చేయాలో నిరంతరం కంట్రోల్ రూమ్ కు సమాచారం అందుతూ ఉంటుంది. ఆ సమాచారాన్ని వైర్ లెస్ సెట్ల ద్వారా రోడ్లపై విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందికి తెలియజేస్తారు. దీంతో ట్రాఫిక్ సమస్యను సులువుగా పరిష్కరించవచ్చు' అని ఢిల్లీ స్పెషల్ కమిషనర్ (ట్రాఫిక్) ముక్తేశ్ చందర్ చెప్పారు. నిమజ్జన మహోత్సవరం నాడు కేవలం రోడ్లపై ఉండి ట్రాఫిక్ ను నియంత్రించడం కష్టసాధ్యమని, అందుకే ఈ ఏర్పాటని, ఇందుకోసం 'పవన్ హన్స్' అనే సంస్థకు చెందిన హెలికాప్టర్ ను అద్దెకు తీసుకున్నట్లు తెలిపారు.