పోలవరం నిర్వాసితుల రాస్తారోకో
రెండు గంటలు స్తంభించిన రాకపోకలు
నెల్లిపాకను ముంపుగా ప్రకటించాలని డిమాండ్
నెల్లిపాక :
తమ గ్రామాన్ని పోలవరం ప్రాజెక్ట్ ముంపు గ్రామంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ నెల్లిపాక వాసులు రోడ్డెక్కారు. 30వ నంబర్ జాతీయరహదారిపై రెండుగంటల సేపు వారు రాస్తారోకో నిర్వహించారు. దాంతో రాకపోకలు స్తంభించాయి. పోలవరం నిర్వాసితుల సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన ఈకార్యక్రమానికి సీపీఎం, వైఎస్సార్ సీపీ మద్దతు తెలిపాయి. పోలవరం ప్రాజెక్టు వలన ఎటపాక మండలంలో అనేక గ్రామాలు ముంపునకు గురవుతున్నా ప్రభుత్వం తప్పుడు సర్వేలు చేసి కేవలం కొన్ని గ్రామాలనే ముంపు ప్రాంతాలుగా గుర్తించటం అన్యాయమని వారు పేర్కొన్నారు. తమ గ్రామాన్ని ముంపుగా గుర్తించి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ వర్తింపజేయాలని నినాదాలు చేశారు. భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య మద్దతు తెలిపి మాట్లాడుతూ ముంపు బాధితులకు టీడీపీ ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తోందని విమర్శించారు. రైతులకు, నిర్వాసితులకు పరిహారం చెల్లించే విషయంలో వివక్షచూపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టిసీమ నిర్వాసితులకు పరిహారం చెల్లించిన విధంగానే కొత్త భూసేకరణ చట్టప్రకారం పోలవరం ముంపు బాధితులకు కూడా పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. నిర్వాసితులకు న్యాయం జరిగేంతవరకు పోరాటం చేస్తామని చెప్పారు. ఎటపాక సీఐ వీరయ్యగౌడ్, ఎస్సై నాగరాజు నెల్లిపాక చేరుకుని రాస్తారోకో విరమింపజేశాక ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. వైఎస్సార్ సీపీ జిల్లా కార్యదర్శి కొవ్వూరి రాంబాబు, నెల్లిపాక ఎంపీటీసీ సభ్యుడు దుద్దుకూరి సింహాద్రి, సర్పంచ్ కొర్సా రుక్మిణమ్మ, సీపీఎం మండల కార్యదర్శి ఐ. వెంకటేశ్వర్లు, కాక అర్జున్, గద్దల రమణయ్య, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.