విషాదం నింపిన వర్షాకాలం
ముంబై: ఈసారి వర్షాకాలం రాష్ట్రవాసులకు విషాద జ్ఞాపకాలు మిగిల్చిందని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ పేర్కొన్నారు. వరుణుడు స్వైర విహారం చేయడంతో 324 మంది చనిపోయారని తెలిపారు. తూర్పు విదర్భ ప్రాంతంలో ఎక్కువ నష్టం జరిగిందన్నారు. భారీ వర్షాలు, వరదలు, పిడుగులు తదితరుల వల్ల రాష్ట్రవ్యాప్తంగా 324 మంది చనిపోయారని విచారం వ్యక్తం చేశారు. నాగపూర్, అమరావతి డివిజన్లలో భారీగా ఆస్తి నష్టం సంభవించిందన్నారు. ‘రాష్ట్రంలో వర్షాలు, వరదల వల్ల 5,334 కుటుంబాలు నిరాశ్రయులయ్యాయి. మరో 72,718 మంది ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయ’ని ఆయన తెలిపారు. 196 మృతుల కుటుంబాలకు ఇప్పటివరకు ఒక్కొక్క కుటుంబానికి రూ. 2,50,000 చొప్పున నష్ట పరిహారాన్ని చెల్లించామని తెలిపారు. అలాగే ధ్వంసమైన 4,336 ఇళ్లకు కూడా నష్ట పరిహారాన్ని అందించామని ఆయన వివరించారు. అలాగే 1,852 పశువులుకూడా మృతిచెందాయని అన్నారు. పశువులు కోల్పోయిన రైతులకు రూ.5,000 నుంచి 25,000 మధ్య నష్టపరిహారాన్ని చెల్లించామని చెప్పారు.
ఇప్పటివరకు 699 మంది పశువుల యజమానులకు సహాయం అందిందన్నారు. వర్షాల ధాటికి 753 హెక్టార్లలో వేసిన పంటలు పూర్తిగా కొట్టుకుపోయాయని ఆయన తెలిపారు. సాగు చేస్తున్న 3,91,069 హెక్టార్లలో కనీసం 50 శాతానికి పైగా పంటలకు నష్టం కలిగిందన్నారు. కొంకణ్. పుణే, నాసిక్, ఔరంగాబాద్ ప్రాంతాల్లో ఇప్పటికీ సర్వే చేస్తున్నామని, పూర్తి గణాంకాల అందాక రైతులకు నష్టపరిహారం చెల్లిస్తామని భరోసా ఇచ్చారు. పంటలు పూర్తిగా నష్టపోయిన రైతులకు హెక్టార్‌కు రూ.25,000. కొండచరియలు విరిగిపడితే రూ.20,000 నష్టపరిహారం చెల్లిస్తున్నామని తెలిపారు. వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన ప్రతి ఒక్కరినీ రాష్ర్ట సర్కార్ అదుకుంటుందని అన్నారు. ఏ రైతుకు అన్యాయం జరగకుండా చూసుకుంటామని ఆయన భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు.