‘టెయిల్‌పాండ్’ పనులకు ఆటంకం
అడవిదేవులల్లి(దామరచర్ల), న్యూస్‌లైన్: ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా వచ్చిన వరదలతో మండలంలోని అడవిదేవులపల్లి గ్రామశివారులో చేపట్టిన టెయిల్‌పాండ్ ప్రాజెక్టు పనులకు ఆటంకం ఏర్పడింది. డ్యాంపై నుంచి సుమారు 10ఫీట్ల ఎత్తులో వరద పోటెత్తడంతో చేపట్టిన పనులన్నీ దెబ్బతిన్నాయి.
నాగార్జునసాగర్ డ్యాంకు దిగువన 21 కిలోమీటర్ల దూరంలో మండలంలోని అడవిదేవులపల్లి గ్రామ శివారులో రూ.474 కోట్ల తో టెయిల్‌పాండ్ ప్రాజెక్టు నిర్మాణ పనులను 2006లో చేపట్టారు. ప్రాజెక్టు పనుల్లో భాగంగా వంతెన నిరించాల్సి ఉంది. 20 పిల్లర్లు, 21 గేట్ల నిర్మాణం చేపట్టాల్సి ఉంది. ఈ పనులు 2009లో పూర్తికావాలి. అయితే పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ కొంత మేర పనిచేశాడు. నిధులు సరిపోవడంలేదని వీటిని పెంచితేనే కొనసాగిస్తామని 2012 అక్టోబర్‌లో పనులు నిలిపివేశాడు. రూ.700కోట్లు కేటాయిస్తేనే పనులు చేపడతామన్నాడు. దీంతో ఏడు నెలల పాటు పనులు నిలిచిపోయాయి. కాంట్రాక్టర్ చేసిన ప్రతిపాదనకు జెన్కో అధికారులు అంగీకరించడంతో 2013 మేలో తిరిగి పను లు ప్రారంభమయ్యాయి. ఇప్పటి వరకు 21క్రస్ట్‌గేట్లకు గాను 8 గేట్లు పూర్తయ్యాయి. 20 పిల్లర్ల పనులు పూర్తిచేశారు. ప్రాజెక్టుపై వంతెన పనులు కొనసాగుతున్నాయి. 50మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే సామర్థ్యం కలిగిన రెండు కేంద్రాలను ఏర్పాటు చేశారు.
కూలిన కాపర్ డ్యాం
నైరుతి రుతుపవనాల వల్ల కురిసిన వర్షాల కారణంగా నాగార్జునసాగర్ డ్యాం నిండడంతో గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలారు. దీంతో ఈ ఏడాది ఆగస్టు 1న టెయిల్‌పాండ్ ప్రాజెక్టు వరద తాకిడికి గురికావడంతో పనులకు ఆటం కలిగింది. అలాగే ఇటీవల తుపాను వల్ల కురిసిన వర్షంకారణంగా కూడా భారీ వరదలు వచ్చాయి. డ్యాంపై నుంచి సుమారు 8ఫీట్ల ఎత్తులో నీరు ప్రవహించింది. అయితే సుమారు 100 రోజుల నుంచి పనులు నిలిచిపోయాయి. అయితే కృష్ణానదిలోని నీటిని మళ్లించేందుకు ఏర్పాటు చేసిన కాపర్‌డ్యాం ఎగువ, దిగువ భాగాల్లో కొంత కూలిపోయింది. అలాగే డ్యాం దిగువన వాహనాల రాకపోకల కోసం తాత్కాలికంగా నిర్మించిన రోడ్డు వరదల వల్ల కొట్టుకుపోయింది.
భారీ క్రేన్ వరదల తాకిడికి ధ్వంసమైంది. ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన మెటీరియల్ కొట్టుకుపోయింది. ఇదిలా ఉండగా వరద తాకిడికి గురై కూలిపోయిన కాపర్‌డ్యాం పనులు, ధ్వంసమైన రోడ్డుకు మరమ్మతు పనులు కొనసాగుతున్నాయి. ఇదిలా ఉండగా వారం రోజుల్లో ప్రాజెక్టు పనులు పునఃప్రారంభమవుతాయని అధికారులు చెబుతున్నారు.
ఏడు నెలల్లో పనులు పూర్తి చేస్తాం
- పీడీవీఎల్ కుమార్, ప్రాజెక్టు ఎస్ఈ
డ్యాం నిర్మాణ పనులను 2014 జూలై 31నాటికి పూర్తి చేయాలన్న కృత నిశ్చయంతో ఉన్నట్లు ప్రాజెక్టు ఎస్ఈ పీడీవీఎల్ కుమార్ తెలిపారు. ఇప్పటి వరకు 80 శాతం పనులు పూర్తయినట్లు చెప్పారు. 21 క్రస్ట్‌గేట్లలో 8 గేట్లు పూర్తికాగా 13గేట్లు నిర్మాణ దశలో ఉన్నాయన్నారు. ప్రాజెక్టుపై వంతెన నిర్మాణ పనుల వేగవంతంగా చేపడతామన్నారు. వంతెనపై 20 వెంట్లలో 12 వెంట్లు పూర్తయినట్లు చెప్పారు.