రాచకొండకు రాజయోగం
చౌటుప్పల్: నల్లగొండ జిల్లా చౌటుప్పల్ మండల పరిధిలోని రాచకొండకు మళ్లీ రాజయోగం పట్టనుంది. ఇన్నాళ్లూ ఉమ్మడి రాష్ట్రంలో నిరాదరణకు గురైన రాచకొండకు, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా టీఎస్ ఐపాస్ పేరుతో తీసుకొచ్చిన నూతన పారిశ్రామిక విధానంతో మహర్దశ పట్టనుంది. ఈ పారిశ్రామిక విధానానికి ఆకర్షితులవుతున్న పారిశ్రామికవేత్తలు, ఇప్పుడిప్పుడే హైదరాబాద్‌కు చేరువలోని రాచకొండపై ఆసక్తిని కనబరుస్తున్నారు. ఇది పరిశ్రమల ఏర్పాటుకు ఎంతో అనువైన ప్రాంతమని భావిస్తున్నారు.
నల్లగొండ-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ జిల్లాల సరిహద్దులో రాచకొండ అటవీ ప్రాంతం ప్రభుత్వ, అటవీ, అసైన్డ్, సీలింగ్ భూములతో కలుపుకొని 42 వేల ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇది హైదరాబాద్ నగరానికి చేరువలో, శంషాబాద్ విమానాశ్రయానికి 25 కిలోమీటర్ల లోపు దూరంలో, ఔటర్ రింగ్‌రోడ్డుకు అతి సమీపంలో ఉంది. దీంతో ప్రభుత్వం మూడు జిల్లాల సరిహద్దులోని ప్రాంతమంతటినీ పారిశ్రామిక కారిడార్‌గా అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే రెండుమార్లు ఈ ప్రాంతంలో ఏరియల్ సర్వే చేశారు.
పరిశ్రమల ఏర్పాటుకు అనువైన ప్రాంతంగా గుర్తించారు. పారిశ్రామిక వేత్తలు కూడా పరిశీలించి బాగుందని చెప్పడంతో, మహబూబ్‌నగర్ జిల్లా ముశ్చర్లలో ఫార్మాసిటీకి 11 వేల ఎకరాల భూమిని కేటాయించారు. రాచకొండలో 2 వేల ఎకరాల్లో ఆత్యాధునిక హంగులతో కూడిన సినిమా సిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
రైలు బోగీల పరిశ్రమ
రాచకొండలో పరిశ్రమల ఏర్పాటుకు అనువైన స్థలం కోసం ఇప్పటికే ప్రభుత్వ యంత్రాంగం సర్వే చేసింది. 14 వేల ఎకరాల భూమి పరిశ్రమల ఏర్పాటుకు అనువుగా ఉన్నట్టు తేల్చింది. ఈ భూమిని క్లస్టర్లుగా విభజించనున్నారు. ఒక్కో క్లస్టర్‌ను ఒక్కో దానికి కేటాయించే ఆలోచన చేస్తున్నారు. ఓ క్లస్టర్లో 2 వేల ఎకరాలు ఫిలింసిటీకి, మరో 2 వేల ఎకరాలు స్మార్ట్ సిటీకి కేటాయించే ఆలోచన చేస్తున్నారు. హైదరాబాద్ పరిసరాల్లో రైలు బోగీల పరిశ్రమ ఏర్పాటుకు ముందుకొచ్చిన రుయా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ పవన్‌కుమార్ రుయా, అంతర్జాతీయ గుర్తింపు ఉన్న కంపెనీల ప్రతినిధులతో కలసి వారంరోజుల క్రితం రాచకొండ ప్రాంతాన్ని పరిశీలించారు.
శంషాబాద్ విమానాశ్రయం, ఔటర్ రింగ్‌రోడ్డు, ఎన్‌హెచ్-65లకు రాచకొండ ఎంతదూరంలో ఉందనే విషయంపై ఆరా తీశారు. అనంతరం రాచకొండ పరిశ్రమల ఏర్పాటుకు బాగుందని కితాబునిచ్చారు. ఏడు దేశాల కంపెనీల సహకారంతో 2 వేల ఎకరాల్లో రూ.20 వేల కోట్ల పెట్టుబడులతో స్మార్ట్సిటీతోపాటు, పలు పరిశ్రమల ఏర్పాటుకు సానుకూలంగా ఉన్నట్టు తెలిపారు. ఇప్పటికే ప్రభు త్వ పరిశీలనలో ఫిల్మ్‌సిటీ, స్పోర్ట్స్‌సిటీ, ఎడ్యుకేషన్ హబ్ లాంటి ఎన్నో ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు ప్రతిపాదనల్లో ఉన్నాయి. కాగా ఇప్పటికే, రంగారెడ్డి జిల్లా మంచాల మండలంలో ఉమ్మడి ఏపీ రాష్ట్రంలోనే పలు పరిశ్రమలకు ఏపీఐఐసీ భూములను కేటాయించింది.
రాచకొండకు నాలుగులేన్ల రోడ్లు
రాచకొండకు హైదరాబాద్ నుంచి, శంషాబాద్ నుంచి, 65వ నెంబరు జాతీయ రహదారి నుంచి నాలుగులేన్ల రోడ్లను అభివృద్ది చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. దీనికి తోడు ప్రస్తుతం ఉన్న ఔటర్ రింగ్‌రోడ్డుకు అనుసంధానంగా, మెదక్, వరంగల్, కరీంనగర్, శ్రీశైలం, విజయవాడ జాతీయ రహదారులను కలుపుతూ, మరో రింగ్ రోడ్డు నిర్మించాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోంది.
ఇదే విషయమై ఇప్పటికే హైదరాబాద్ నుంచి 60 నుంచి 100 కి.మీ. దూరంతో రింగ్ రోడ్డు ఉంటుందని ప్రకటన కూడా చేసింది. హైవేలను కలపడం ద్వారా, రాజధానికి వాహనాల రద్దీని తగ్గించాలనేది ఈ రింగ్‌రోడ్డు ఉద్దేశం. ఈ రోడ్డుతో రాచకొండ ప్రాంతం రింగురోడ్డు లోపలకు వస్తుంది. ైెహ దరాబాద్‌కు రవాణా సౌకర్యం మరింత మెరుగవుతుంది.