ముగిసిన వేసవి శిక్షణ శిబిరాలు
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ క్రీడాప్రాధికార సంస్థ (శాప్), గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) వేర్వేరుగా నిర్వహిస్తున్న వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు ముగిశాయి. జంటనగరాల్లోని పలు ప్లే గ్రౌండ్లలో నిర్వహించిన ఈ శిబిరాలకు వేల సంఖ్యలో బాలబాలికలు హాజరయ్యారు. సుమారు నెలన్నర పాటు సాగిన ఈ క్యాంపులో వివిధ క్రీడల్లో అనుభవజ్ఞులైన కోచ్‌ల నేతృత్వంలో ఆటలు నేర్చుకున్నారు. శిబిరం ముగిసే దశలో విద్యార్థుల ప్రతిభ నిరూపించుకునేందుకు వీలుగా హాకీ, స్విమ్మింగ్, టెన్నిస్, రోలర్ స్కేటింగ్ తదితర ఈవెంట్లలో పోటీలు నిర్వహించారు.
ఒలింపియన్ కిటుకులు
కాప్రాలోని విజయ హైస్కూల్ గ్రౌండ్లో ఏప్రిల్ 26న ప్రారంభమైన హాకీ శిబిరం గురువారం ముగిసింది. 41 రోజుల పాటు ఇక్కడ నిర్వహించిన శిబిరంలో బాలబాలికలకు హాకీ క్రీడను నేర్పించారు. ఉదయం, సాయంత్రం రెండు సెషన్లలో నిర్వహించిన ఈ క్యాంపులో 40 మంది బాల బాలికలు ఉత్సాహంగా పాల్గొన్నారు. చివరి రోజు గురువారం హాకీ ఒలింపియన్ అలోయసిస్ ఎడ్వర్డ్స్ బాలబాలికలతో ఉల్లాసంగా గడిపారు. వారడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఆటలో కిటుకులు చెప్పారు.
ఇందిరాపార్క్‌లో...
లోయర్ ట్యాంక్‌బండ్‌లోని ఇందిరాపార్క్‌లో టెన్నిస్, రోలర్ స్కేటింగ్ క్రీడాంశాల్లో శిక్షణ ఇచ్చారు. చివరి రోజు టెన్నిస్ కోర్టుల్లో శిక్షణ కాకుండా పోటీలు నిర్వహించారు. ఇందులో రాణించినవారికి పతకాలు అందజేశారు. స్కేటింగ్‌లోనూ సత్తాచాటిన బాలబాలికలు డిప్యూటీ మేయర్ జి.రాజ్‌కుమార్ చేతుల మీదుగా బహుమతులు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ క్రీడాధికారులు పాల్గొన్నారు.
గచ్చిబౌలీలో...
గచ్చిబౌలీలోని స్విమ్మింగ్‌పూల్‌లో చివరి రోజు పోటీలు నిర్వహించారు. అండర్-10 బాలబాలికల విభాగాల్లో సూరజ్ కిరణ్, అభినయ విజేతలుగా నిలిచారు. అండర్-12 బాలుర విభాగం టైటిల్‌ను గౌతమ్ సింగ్ గెలుపొందగా, బాలికల టైటిల్‌ను అకాంక్ష చేజిక్కించుకుంది. అండర్-14 బాలుర ఈవెంట్లో హేమంత్ రెడ్డి, బాలికల ఈవెంట్లో దీపిక నాయక్ గెలుపొందారు.