పరీక్షకు సిద్ధం
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : సర్కారు కొలువు కోసం నిరీక్షిస్తున్న అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకునే సమయం వచ్చింది. వీఆర్వో, వీఆర్ఏ పరీక్షలకు ఇంకా 24 గంటల వ్యవధే మిగిలివుంది. జిల్లాలో 83 వీఆర్వో, 223 వీఆర్ఏ పోస్టుల ఎంపిక కోసం ఆదివారం పరీక్ష జరగనుంది. సగటున ఒక్కో పోస్టుకు వెయ్యి మందికి పైగా దరఖాస్తు చేసుకోవడంతో తీవ్రమైన పోటీ నెలకొంది. దీంతో అంతటా ఈ పోస్టులపైనే చర్చించుకోవడం కనిపిస్తోంది. పరీక్షలో నెగ్గి విజేతగా నిలిచి ఉద్యోగం దక్కించుకోవడమే లక్ష్యంగా అభ్యర్థులు ముందుకెళ్తున్నారు. ఇప్పటివరకు శిక్షణ కేంద్రా లు, పుస్తకాలతో కుస్తీలు పట్టినవారు కొత్తవి చదవడం కంటే చదివినవే మననం చేసుకుంటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. పోటీ ఎక్కువగా ఉందని నిరాశ చెందకుండా ఆత్మవిశ్వాసంతో ప్రయత్నిస్తే విజయం సులువేనని చెబుతున్నారు. విశ్వాసమే విజయసూత్రమనే మాటను గుర్తుచేస్తున్నారు.
తప్పని దూర భారం
పకడ్బందీ ఇన్విజిలేషన్తో పరీక్షలు నిర్వహించలేని ఏపీపీఎస్సీ తన అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు జంబ్లింగ్ పేరుతో అభ్యర్థులను ఇబ్బందులకు గురిచేస్తోంది. అభ్యర్థులకు జిల్లా నలుమూలల దూరప్రాంతాల్లోని పరీక్ష కేంద్రాలను కేటాయించింది. ఈ మేరకు జిల్లావ్యాప్తంగా ఐదు డివిజన్లలో 229 కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ముందుగా 231 కేంద్రాలను ప్రకటించినప్పటికీ అభ్యర్థులు సరిపోయారనే కారణంతో సుల్తానాబాద్‌లోని రెండు కేంద్రాలను తగ్గించారు. ఇప్పటికే దరఖాస్తుల అప్లోడ్, జిరాక్సులు, హాల్‌టికెట్ డౌన్లోడ్, ప్రయాణ ఖర్చులతో ఒక్కో అభ్యర్థి రూ.400-500 వరకు ఖర్చు చేశారు.
మంథని అభ్యర్థికి సిరిసిల్లలో, సిరిసిల్ల అభ్యర్థికి మంథనిలో, కరీంనగర్ అభ్యర్థికి మెట్పల్లిలో.. ఇలా దూర ప్రాంతాల్లో సెంటర్లు కేటాయించడంతో ప్రయాణం, వసతి, భోజనం ఖర్చులు అదనపు భారమవుతున్నాయి. సెంటర్‌కు సమయానికి చేరుకుంటామో లేదోనని పలువురు అభ్యర్థులు ముందుగానే వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. పట్టణాల్లో రద్దీ ఎక్కువగా ఉండే అవకాశమున్న దృష్ట్యా పరీక్ష కేంద్రాలకు సమీపంలోని బంధువులు, స్నేహితులు వద్ద లేదా ఇతర వసతి కేంద్రాలకు ఒక రోజు ముందుగానే చేరుకునేలా ప్రణాళిక తయారు చేసుకుంటున్నారు.
హెల్ప్‌లైన్‌కు ఫోన్లు..
వీఆర్వో, వీఆర్ఏ పరీక్షలు రాసే అభ్యర్థుల కోసం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్ (0878-2234731)కు అభ్యర్థులు ఫోన్లు చేసి సందేహాలను నివృత్తి చేసుకుంటున్నారు. ఎక్కువగా హాల్‌టికెట్‌లో ఫొటోలు సరిగా లేవని, సంతకం లేదని, రెండు చోట్ల కేంద్రాలున్నాయని ఫోన్లు వస్తున్నాయని, అభ్యర్థులకు తగు సలహాలు, సూచలను అందిస్తున్నామని హెల్ప్‌లైన్ సిబ్బంది తెలిపారు. శుక్రవారం సాయంత్రం వరకు హెల్ప్‌లైన్‌కు 70 ఫోన్లు రాగా, డీఆర్వో కృష్ణారెడ్డి పర్యవేక్షించారు.
పకడ్బందీ ఏర్పాట్లు
: కలెక్టర్ ఎం.వీరబ్రహ్మయ్య
వీఆర్వో, వీఆర్ఏ పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ ఎం.వీరబ్రహ్మయ్య శుక్రవారం తెలిపారు. 83 వీఆర్వో పోస్టులకు 93,596 మంది, 223 వీఆర్ఏ పోస్టులకు 5,011 మంది పరీక్షలు రాయనున్నారని పేర్కొన్నారు. వీఆర్వో కోసం 229, వీఆర్ఏ కోసం నాలుగు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఐదు కేంద్రాలకు ఒకరు చొప్పున 45 మంది తహశీల్దార్లను లైజన్ ఆఫీసర్లుగా నియమించామన్నారు. 229 మందిని అసిస్టెంట్ లైజన్ ఆఫీసర్లు, మరో 229 మందిని చీఫ్ సూపరిండెంట్లు, ఇంకో 229 మంది అదనపు చీఫ్ సూపరెండెంట్లు, 4,313 మంది ఇన్విజిలేటర్లను నియమించామని తెలిపారు. 23 ఫ్లయింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేశామని, ఒక్కో బృందంలో డెప్యూటీ తహశీల్దార్, రెవెన్యూ ఇన్స్పెక్టర్, పోలీస్ కానిస్టేబుల్ ఉంటారని పేర్కొన్నారు. పరీక్షల జిల్లా కో-ఆర్డినేటర్‌గా డీఆర్వో కృష్ణారెడ్డి, అసిస్టెంట్ కో-ఆర్డినేటర్లగా సబ్‌కలెక్టర్, సంబంధిత రెవెన్యూ డివిజనల్ అధికారులు వ్యవహరిస్తారని తెలిపారు.
200 ప్రత్యేక బస్సులు
మంకమ్మతోట : వీఆర్వో, వీఆర్ఏ పరీక్ష కేంద్రాలకు కరీంనగర్ బస్‌స్టేషన్ నుంచి 200 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ రీజినల్ మేనేజర్ మునిశేఖర్ తెలిపారు. జిల్లాలోని 11 డిపోలకు చెందిన బస్సులను జిల్లా కేంద్రం మీదుగా పంపించేందుకు రూట్‌మ్యాప్ తయారు చేశామన్నారు.