రైళ్లన్నీ ఫుల్
సాక్షి, విజయవాడ : సంక్రాంతి పండగకు సొంత ఊరికి వచ్చి మళ్లీ తిరిగి వెళ్లాలనుకున్న వారికి తిప్పలు తప్పేట్లు లేవు. ప్రయాణికుల రద్దీకి తగినట్లుగా ఆర్టీసీ, రైల్వేలు అదనపు బస్సులు, రైళ్లు నడుపుతున్నా అవి అవసరానికి ఏ మాత్రం సరిపోవడం లేదు. ఆన్లైన్ బుకింగ్ల కారణంగా టికెట్లన్నీ దళారుల చేతుల్లోకి వెళ్లిపోయాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు ప్రైవేటు బస్సులపై ఆర్టీఏ అధికారుల దాడుల కారణంగా ఆ బస్సులు నిలిచిపోవడంతో టిక్కెట్లు దొరకని పరిస్థితి ఉంది.
16 నుంచి 19 వరకూ అన్ని రైళ్లలో వెయిటింగ్ లిస్ట్ కూడా పూర్తయి ‘నో రూమ్’ అని వస్తోంది.ఈ నెల 10 నుంచి 14 వరకూ రాజధానితోపాటు పలు ప్రాంతాల నుంచి సంక్రాంతి పండుగ కోసం జనం స్వస్థలాలకు చేరుకున్నారు. ఒక్క హైదరాబాద్ నుంచే విజయవాడకు ఆరు వందల వరకూ ప్రత్యేక బస్సులు నడిపారు. దక్షిణ మధ్య రైల్వే కూడా అనేక ప్రత్యేక రైళ్లతోపాటు అదనపు బోగీలను నడిపింది. సంక్రాంతి పండుగ పూర్తి కావడంతో ఇక్కడి నుంచి తిరుగు ప్రయాణం అయ్యేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఈ నెల 20 వరకూ వేసిన రైళ్ల టికె ట్లన్నీ అయిపోగా, వెయిటింగ్ లిస్ట్ కూడా పూర్తయి నో రూమ్ అని వస్తోంది.
రద్దీని తట్టుకునేందుకు ప్రత్యేక రైళ్లు
నర్సాపూర్ నుంచి హైదరాబాద్కు గురువారం ఒక ప్రత్యేక రైలును నడుపుతున్నారు. ఆ రైలుకి కూడా ఉదయం బుకింగ్ ప్రారంభించగా పదకొండు గంటలకల్లా టికెట్లు పూర్తయి వెయిటింగ్ లిస్ట్ వస్తోంది. ఆన్లైన్ బుకింగ్లోనే ఎక్కువ టికెట్లు బుక్ అయిపోయాయి. ఇవి ఎక్కువ దళారుల చేతుల్లోకి వెళ్లినట్లు ఆరోపణలున్నాయి.
ఈ-టిక్కెట్ తీసుకుంటే కచ్చితంగా ఏదో ఒక గుర్తింపుకార్డును టీసీలకు చూపించాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం వారికి ఉన్న పని వత్తిడి, రద్దీ కారణంగా అసలు కొన్ని బోగీలలో టిక్కెట్లు తనిఖీ చేయడమే కుదరని పరిస్థితి ఉంది. దీన్ని ఆసరాగా తీసుకుని దళారులు పెద్ద ఎత్తున సొమ్ము చేసుకున్నట్లు సమాచారం. శుక్రవారం విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్కు ప్రత్యేక రైలు బయలు దేరుతుంది. అది ఆరోజు అర్ధరాత్రి ఒంటిగంటకు విజయవాడకు చేరుతుంది. మళ్లీ తిరుగు ప్రయాణంలో 18వ తేదీ సాయంత్రం నాలుగున్నరకు బయలుదేరి రాత్రి తొమ్మిదిగంటల 15 నిముషాలకు విజయవాడ చేరుతుంది.
ఆదనంగా వందబస్సులు.. ఆర్టీసీ అదనంగా వంద బస్సులు నడపడానికి రంగం సిద్దం చేసింది. బుధవారం వంద బస్సులను ఏర్పాటు చేశారు. అయితే సాయంత్రానికి 40 బస్సులకు మాత్రమే రిజర్వేషన్ పూర్తి అయ్యింది. రాత్రికి రద్దీ ఉంటుందని భావిస్తున్నారు. పండుగ ఒకరోజు ఆలస్యంగా రావడంతో 16నుంచి 19వ తేదీ వరకూ రద్దీ ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.