దేవుడు కనిపిస్తాడు..!
- గుంతకల్లు- తిరుపతి ప్యాసింజర్లో ప్రయాణికుల పాట్లు
- బోగీల్లో కిటకిట
- నిలబడేందుకూ చోటు ఉండదు
- చార్జీ తక్కువ.. అవస్థలు ఎక్కువ
- బోగీల సంఖ్యను పెంచని అధికారులు
గుంతకల్లు : గుంతకల్లు నుంచి తిరుపతి వెళ్లే (నెం. 57478/77) ప్యాసింజర్ రైలు నిత్యం ప్రయాణికులతో కిటకిటలాడుతోంది. తిరుమల వెంకటేశ్వరస్వామి దర్శనార్థం వెళ్తే భక్తులకు ఈ రైలు అనుకూలం. గుంతకల్లు నుంచి తిరుపతికి ఎక్స్ప్రెస్ బస్సులో వెళ్లాలంటే టిక్కెట్ ధర రూ.450 . రైలులో సాధారణ టిక్కెట్ రూ.70లు, రిజర్వేషన్ టిక్కెట్ రూ.150. దీంతో రైలుకు ప్రయాణికుల సంఖ్య అధికంగా ఉంటోంది. ఇటీవల రాయదుర్గం–కళ్యాణదుర్గం రైలు మార్గం పూర్తి కావడంతో ఈ రైలును కళ్యాణదుర్గం రైల్వేస్టేషన్ వరకు పొడిగించారు. ఒక్కసారిగా వెయిటింగ్ లిస్టులు పెరిగాయి. ముందస్తు బుకింగ్లకు వందల్లో వెయిటింగ్ లిస్టు చూపుతుంది. ఈ రైలుకు కేవలం 2 స్లీపర్, మరో 10 జనరల్ బోగీలున్నాయి.
బళ్లారి ప్రాంత వాసులు అధిక శాతం తిరుపతికి బుక్ చేసుకుంటున్నారు. తగినన్ని జనరల్ , రిజర్వేషన్ బోగీలు లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సాధారణ బోగీలో 80 నుంచి 90 మంది మాత్రమే ప్రయాణించేందుఉ వీలుగా ఉంటుంది. అయితే ఒక్కో జనరల్ బోగీలో 130 నుంచి 150 మంది దాకా ప్రయాణించాల్సి వస్తోంది. శుక్ర, శనివారం, సెలవు రోజుల్లో బోగీలో ప్రయాణికుల సంఖ్య కాస్తా 200 చేరుకుంటోంది. నిలబడేందుకు కూడా చోటు ఉండదని ప్రయాణికులు వాపోతున్నారు. కొందరు మరుగుదొడ్లలో నిలబడి ప్రయాణించాల్సిన దుస్థితి. సాధారణంగా ఒక రైలింజన్ 17 నుంచి 19 బోగీల వరకు లాగుతుంది. ఈ రైలుకు కేవలం 12 బోగీలు మాత్రమే అటాచ్ చేశారు. గుంతకల్లు, అనంతపురం, ధర్మవరం ప్రయాణికుల కోసం గుంతకల్లు నుంచి మరో 3 స్లీపర్ బోగీలు, 2 సాధారణ బోగీలు జతపరచాలని ప్రయాణికులు కోరుతున్నారు.
రిజర్వేషన్ బోగీలు పెంచాలి : – వెంకటేష్, ప్రయాణికుడు
గుంతకల్లు నుంచి తిరుపతి వెళ్లే ప్యాసింజర్ రైలుకు అదనంగా రిజర్వేషన్ బోగీలు ఏర్పాటు చేయాలి. ఈ రైలును కళ్యాణదుర్గం వరకు పొడిగించడంతో గుంతకల్లు ప్రయాణికులకు రిజర్వేషన్ దొరకడం లేదు. గుంతకల్లు నుంచి అదనంగా రిజర్వేషన్ బోగీలు ఏర్పాటు చేయాలి.
-------
నిలబడేందుకూ చోటు ఉండదు
ప్రతి రోజూ రైలు రద్దీగా ఉంటుంది. శుక్ర, శనిఽవారం బోగీలో నిలబడేందుకు కూడా చోటు ఉండదు. సాధారణ బోగీలు తక్కువ ఉండడంతోనే ఈ పరిస్థితి. మరిన్ని బోగీలు పెంచితే ప్రయాణికులకు సౌకర్యం, సంస్థకు ఆదాయం ఉంటుంది.
-మస్తానయ్య, ప్రయాణికుడు