మంటల వదంతులు.. ఆగిన మెట్రో రైలు
ఢిల్లీ మెట్రో రైల్లో అగ్నిప్రమాదం జరిగినట్లు కొందరు ప్రయాణికులు ఫిర్యాదు చేయడంతో మెట్రో రైలు సర్వీసులు దాదాపు అరగంట పాటు నిలిచిపోయాయి. అర్జన్‌గఢ్- ఘితోర్ని మధ్య నడిచే మెట్రో రైలు జహంగీర్‌పురి నుంచి హుడా సిటీ సెంటర్ మధ్య ప్రాంతంలో ఉండగా ఈ సంఘటన జరిగింది. మధ్యాహ్నం 1.04 గంటల సమయంలో రైల్లోని చివరి బోగీలో కొంతమంది ప్రయాణికులు నిప్పు రవ్వలు, పొగ చూశారు. వెంటనే వాళ్లు డ్రైవర్‌కు సమాచారం అందించగా డ్రైవర్ అత్యవసర బ్రేకులు వాడి రైలును ఆపేశారు.
అయితే, బోగీలో పూర్తిగా పరిశీలించగా మంటలు ఏవీ రాలేదని తేలింది. అయినా రైలును మాత్రం తదుపరి పరీక్షల కోసం సర్వీసు నిలిపివేశారు. మంటలు కనిపించకపోయినా.. నిప్పు నెరుసులు ఎగసిన మాట మాత్రం వాస్తవమేనని ప్రాథమిక విచారణలో తేలింది. రైలుకు గానీ, ప్రయాణికులకు గానీ ఎలాంటి ప్రమాదం వాటిల్లలేదని మెట్రో రైలు అధికార ప్రతినిధి తెలిపారు. అరగంట తర్వాత రైలు రాకపోకలను పునరుద్ధరించారు.