సైకిళ్లకూ ఓ ఎస్కలేటర్..!
వీలైనంత వరకూ సైకిళ్లను బయటికి తీయండి.. కాలుష్యాన్ని తగ్గించండి.. పర్యావరణాన్ని కాపాడండి.. అంటూ తరచూ ప్రచారం జరుగుతుంటుంది. కానీ సైకిల్ ట్రాకులే ఉండవు. పైగా రోడ్లు అంతెత్తున ఎగుడు దిగుళ్లుగా ఉంటే ఇక సైకిల్ తొక్కడం కష్టమే. అందుకే.. సైక్లిస్టులను ప్రోత్సహించేందుకని నార్వేలోని ట్రాండ్హీమ్ నగరంలో ఇలా సైకిళ్ల కోసం ప్రత్యేక ఎస్కలేటర్ నిర్మించారు. దీనిపై వెళ్లడం చాలా సింపుల్. సైకిల్‌పై వచ్చి.. కుడి కాలును ట్రాకుపై ఉండే ఫుట్ప్లేట్పై ఉంచాలి. ఓ బటన్ నొక్కాలి. అంతే. ఫుట్‌ప్లేట్ ముందుకు కదులుతుంది.
రోడ్డు ఎత్తుగా ఉన్నా.. శ్రమ పడకుండానే పైకి వెళ్లొచ్చు. మనం దిగాల్సిన చోటు రాగానే ఫుట్‌ప్లేట్ మీది నుంచి కాలును తీస్తే చాలు. ఆ ప్లేట్ లోపలికి వెళ్లిపోతుంది. ఒకేసారి వరుసగా ఆరుగురు వెళ్లొచ్చు కూడా. పైలట్ ప్రాజెక్టుగా దీనిని 2003లోనే ప్రారంభించగా గతేడాదే పూర్తిస్థాయిలో ఏర్పాటు చేశారు. సైకిళ్ల ఎస్కలేటర్ ప్రపంచంలో ఇప్పటికీ ఇదొక్కటే ఉందట. ఈ ఎస్కలేటర్ ఏర్పాటుకు ఖర్చెంతో చెప్పలేదు కదూ.. మీటరుకు రూ. లక్ష వరకూ అవుతుందట.