230 కేసులు.. 55 కోట్ల జప్తు
బినామీ లావాదేవీల చట్టం కింద నమోదు చేసిన ఆదాయ పన్ను శాఖ
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు అనంతరం తీసుకున్న చర్యల్లో భాగంగా బినామీ లావా దేవీల చట్టం కింద దేశవ్యాప్తంగా 230 కేసులను ఆదాయ పన్ను శాఖ నమోదు చేసింది. సుమారు రూ.55 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసింది. ‘ఫిబ్రవరి రెండో వారం నాటికి సుమారు 230కి పైగా కేసు లు నమోదు చేశాం. అందులో 140 కేసుల కు సంబంధించి రూ.200 కోట్ల విలువైన ఆస్తుల జప్తునకు షోకాజ్ నోటీసులు జారీ చేశాం. ఇప్పటివరకు 124 కేసుల్లో రూ.55 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేశాం’ అని ఆదాయ పన్ను శాఖ తన నివేదికలో పేర్కొంది.
బ్యాంకు ఖాతాలు, వ్యవసాయ, ఇతర భూములు, ఇళ్లు, ఆభరణాలు తదితరాలు జప్తు చేసిన ఆస్తుల్లో ఉన్నాయని అధికారులు తెలిపారు. గత నవంబర్ 1 నుంచే అమల్లోకి వచ్చేలా బినామీ లావాదేవీల చట్టాన్ని కేంద్రం రూపొందిం చింది. ఈ చట్టాన్ని అతిక్రమించిన వారికి భారీ జరిమానాతోపాటు, ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష విధించే అవకాశం ఉంది.