సర్కార్‌కు కన్నీటి నివాళి
- జేఎన్టీయూ వీసీ పార్థివదేహం విశాఖకు తరలింపు
- నేడు అంత్యక్రియలు
జేఎన్టీయూ : జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ (జేఎన్టీయూ-ఏ)లో గురువారం గంభీర వాతావరణం కన్పించింది. వైస్ చాన్సలర్ ఎంఎంఎం సర్కారు మరణంతో వర్సిటీ అధికారులు, ఉద్యోగులు, విద్యార్థులు విషాదంలో మునిగిపోయారు. వీసీ అధికారిక నివాసంలో సర్కార్ పార్థివదేహాన్ని బుధవారం రాత్రి ఎనిమిది గంటల నుంచి గురువారం ఉదయం పది వరకు ప్రజల సందర్శనార్థం ఉంచారు.
ఈ సందర్భంగా పెద్దసంఖ్యలో విద్యార్థులు, అధికారులు, ఉద్యోగులు, ప్రజలు, వివిధ పార్టీల నాయకులు వీసీ పార్థివదేహాన్ని సందర్శించి..ఘన నివాళులర్పించారు. వర్సిటీ విద్యార్థులు, ఉద్యోగులు గంటల తరబడి అక్కడే నిలబడి కొవ్వొత్తులు ప్రదర్శించారు. ‘సర్కార్ సార్.. అమర్‌రహే’ అంటూ నినాదాలు చేశారు. ప్రొఫెసర్లు వీసీతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుని కన్నీటి పర్యంతమయ్యారు. వీసీ కుమారుడు అషరుద్దీన్ షానవాజ్ గుండెలవిసేలా రోదించడం పలువురిని కలిచివేసింది. అనంతరం పార్థివదేహాన్ని ప్రత్యేక వాహనంలో బెంగళూరులోని అంతర్జాతీయ విమానాశ్రయానికి తరలించారు. అక్కడి నుంచి విమానంలో విశాఖపట్నం తీసుకెళ్లారు. అక్కడ శుక్రవారం ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
ప్రముఖుల నివాళి
సర్కార్ పార్థివదేహాన్ని పలువురు ప్రముఖులు సందర్శించి.. నివాళులర్పించారు. అనంతపురం మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఆలూరి సాంబశివా రెడ్డి, ఆర్డీఓ మలోలా, తహసీల్దార్ శ్రీనివాసులు, జేఎన్టీయూ రెక్టార్ ఆచార్య సుబ్బారావు, రిజిస్ట్రార్ ఆచార్య కృష్ణయ్య, ప్రొఫెసర్లు కె.హేమచంద్రారెడ్డి, సుదర్శనరావు, విజయ్‌కుమార్, దుర్గాప్రసాద్, ప్రశాంతి, శశిధర్, కలికిరి ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య ఈశ్వరరెడ్డి, అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఎం.రామశేఖర్‌రెడ్డి, డాక్టర్ చంద్రమౌళిరెడ్డి, డాక్టర్ నారాయణరెడ్డి, డాక్టర్ శివకుమార్, వర్సిటీ పాలకమండలి సభ్యులు కేసీ నాయుడు, మురళి, ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీల బోధనేతర ఉద్యోగుల అసోసియేషన్ (ఆంటియా) వర్కింగ్ ప్రెసిడెంట్ సాకే నాగభూషణం తదితరులు నివాళులర్పించారు. జేఎన్టీయూ పాలకభవనంలో ఏర్పాటు చేసిన సంతాప సభలో వీసీ సర్కార్ సేవలను పలువురు కొనియాడారు.