ఫోకల్ పోస్టింగ్‌ల్లో మార్పులు!
సాక్షి ప్రతినిధి, కర్నూలు : జిల్లాలో భారీగా తహశీల్దార్ల బదిలీలు జరగనున్నాయి. ఈ నెల 26వ తేదీన గణతంత్ర సంబరాలు ముగిసిన తర్వాత తహశీల్దార్ల బదిలీలు కావచ్చని సమాచారం. ప్రధానంగా గతంలో భారీగా డబ్బులిచ్చినప్పటికీ ఫోకల్ పోస్టింగ్ (మంచి పోస్టింగ్) దక్కని తహశీల్దార్లు కోరిన చోట పోస్టింగ్ ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా గతంలో కల్లూరు మండల పోస్టు కోసం వైఎస్సార్ జిల్లా నుంచి బదిలీపై జిల్లాకు వచ్చిన ఓ తహశీల్దార్ ఏకంగా రూ. 10 లక్షలు ఇచ్చారు.
అయితే, చివరకు ఆయన పేరు.. ప్రస్తుతం ఉన్న తహశీల్దార్ పేరు ఒకటే కావడంతో ఆయన్ను ఆలూరు నియోజకవర్గ మండలానికి బదిలీ చేశారు. రూ.పది లక్షలు ఇచ్చినా తనకు మంచి పోస్టింగ్ రాదా అని ఆయన ప్రతి రోజూ అధికార పార్టీ నేతల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. దీంతో త్వరలో జరగబోయే బదిలీల్లో ఆయన కల్లూరు మండలానికి వస్తున్నారనే ప్రచారం ఊపందుకుంది.
అంతేకాకుండా ముఖ్యమైన ఫోకల్ పోస్టింగులైన కర్నూలు, డోన్, ఓర్వకల్లు, నంద్యాల, ఎమ్మిగనూరు, ఆదోని తహశీల్దార్లు కూడా మారనున్నారనే ప్రచారమూ ఇప్పటికే కలెక్టరేట్లో జోరుగా సాగుతోంది. దీంతో నచ్చిన పోస్టింగు కోసం అధికార పార్టీ నేతల చుట్టూ సూట్‌కేసులు పట్టుకుని పలువురు తహశీల్దార్లు తిరుగుతున్నారు.
కర్నూలు ఆర్డీవోగా తిప్పేనాయక్!
కర్నూలు ఆర్డీవో రఘుబాబు కూడా బదిలీ కానున్నారనే ప్రచారమూ జరుగుతోంది. ఈ స్థానంలో మహబూబ్‌నగర్ జిల్లా నెట్టెంపాడు ప్రాజెక్టు భూసేకరణ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌గా ఉన్న తిప్పేనాయక్ వస్తున్నారని జోరుగా వార్తలు షికారు చేస్తున్నాయి. ఇందుకోసం ఇప్పటికే జరగాల్సిన ‘ప్రక్రియ’ మొత్తం పూర్తయిందన్న అభిప్రాయమూ ఉంది. మొత్తం మీద జిల్లాలో మరోసారి భారీగా తహశీల్దార్ల బదిలీలు జరగనున్నాయి.
‘గతంలో ఉన్న జాయింట్ కలెక్టర్ హయాంలో ఒక వెలుగు వెలిగిన తహశీల్దార్లు ఎవ్వరూ కూడా ఫోకల్ పోస్టుల్లో ఉండకూడదని ప్రస్తుత జాయింట్ కలెక్టర్ యోచిస్తున్నారు. ఇదే అదనుగా భావించిన పలువురు తహశీల్దార్లు భారీగా డబ్బులు ముట్టజెప్పి ఫోకల్ పోస్టులలోకి రావాలని ప్రయత్నాలు చేస్తున్నారు’ అని కలెక్టరేట్లోని ఓ ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు.
పాత నేరస్తులపై నిఘా ఉంచండి: ఎస్పీ
కర్నూలు : పాత నేరస్థుల కదలికలైపై నిరంతరం నిఘా ఉంచాలని ఎస్పీ ఆకే రవికృష్ణ సబ్ డివిజన్ పోలీసు అధికారులను ఆదేశించారు. స్థానిక కార్యాలయంలో సబ్ డివిజన్ అధికారులతో ఎస్పీ శుక్రవారం సమావేశమయ్యారు. కర్నూలులో జరుగుతున్న దొంగతనాలు, చైన్‌స్నాచింగ్‌లు, ఆటోడ్రైవర్ల ముసుగులో మహిళలపై జరిగే అఘాయిత్యాలు, నే రాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. డీఎస్పీలు రమణమూర్తి, బాబుప్రసాద్, వి.వి.నాయుడు, మురళీధర్, వినోద్‌కుమార్, హుసేన్‌పీరా పాల్గొన్నారు.