ప్రజలపై విద్యుత్ బిల్లుల పిడుగు!
షాక్ కొడుతున్న కరెంటు బిల్లులు
బిల్లింగ్ ఏజెన్సీల నిర్లక్ష్యం
రెండు బల్బులు వాడే వారికి వేలల్లో బిల్లు
లబోదిబోమంటున్న వినియోగదారులు
పలమనేరు: గంగవరం మండలం డ్రైవ ర్స్ కాలనీకి చెందిన సావిత్రమ్మ ఇంట్లో రెండు బల్బులు మాత్రమే వాడుతోంది. ఆమెకు ప్రతినెలా కరెంటు బిల్లు రూ.120 దాకా వచ్చేది. ఈనెలకు సంబంధించి ఆమె పూర్వపు రీడింగ్ 2,732 కాగా, ప్రస్తుత రీడింగ్ 2750గా ఉంది. ఆ లెక్కన ఆమె 18 యూనిట్లు వాడినట్టు. కానీ బిల్లు మాత్రం రూ.6,741గా వచ్చింది. ఈ బిల్లును తీసుకొని ఆమె ట్రాన్స్‌కో కార్యాలయానికి వెళితే మొత్తం చెల్లించాల్సిందేనని అధికారులు చెప్పారు. అంత డబ్బు ఎలా కట్టేదని బాధితురాలు వాపోతోంది. ఈ ఒక్క కాలనీలోనే దాదా పు వందమందికి అధిక మొత్తంలో బిల్లులొచ్చాయి. ఇలాంటి కేసులు జిల్లాలో వేలల్లోనే ఉన్నాయి.
మూడు నెలలుగా జిల్లాలో కరెంటు బిల్లులు వినియోగదారులకు షాక్ కొడుతున్నాయి. ప్రతినెలా ఇళ్ల వద్ద మీటర్ రీడింగ్ తీసుకొనే బిల్లింగ్ ఏజెన్సీలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ వినియోగదారులతో ఆడుకుంటున్నాయి. రెండు బల్బులు మాత్రమే వాడుకునే వారికి సైతం వీరి నిర్లక్ష్యం కారణంగా వేలల్లో బిల్లులొస్తున్నాయి. జిల్లాలోని ఏడు డివి జన్లలో 12 లక్షల దాకా డొమెస్టిక్ మీటర్లున్నాయి. ఇందుకు సంబంధించి బిల్లింగ్ ప్రక్రియను పలు ప్రైవేటు ఏజెన్సీలు చేపడుతున్నాయి. వీరికి ట్రాన్స్‌కో పట్టణాల్లో రూ.1.75 పైస లు, పల్లెల్లో రూ.2.40 పైసల లెక్కన ఒక్కో మీటర్ రీడింగ్‌కు అందిస్తోంది. పట్టణాల్లో గృహ సర్వీసులకు ప్రతినెలా, పల్లెల్లో రెండు నెలలకోసారి రీడింగ్ (బైమంత్ బిల్లింగ్) తీస్తున్నారు. ఏజెన్సీల నిర్లక్ష్యంతో ప్రతినెలా రూ.3 నుంచి రూ.5 కోట్ల దాకా అదనపు భారం వినియోగదారులపై పడుతున్నట్లు తెలుస్తోంది.
ప్రైవేటు ఏజెన్సీల నిర్లక్ష్యమే కారణం..
ప్రతి ఇంటి వద్దకూ వెళ్లి పూర్వపు రీడింగ్, ప్రస్తుత రీడింగ్‌ను కచ్చితంగా నమోదు చేయాల్సిన ఏజెన్సీ వ్యక్తులు పలుచోట్ల అందుకు విరుద్ధంగా చేస్తున్నారు. డోర్‌లాక్ అయిన ఇళ్లలో రీడింగ్ చూడకుండానే ఇష్టానుసారంగా రీడింగ్ వేస్తున్నట్లు విమర్శలున్నాయి.