కేదార్నాథ్ యాత్రికులకు మొబైల్లో వాతావరణం
డెహ్రాడూన్: కేదార్నాథ్ యాత్రికులకు అత్యాధునిక సౌకర్యం అందుబాటులోకి రానుంది. హిమాలయ పర్వతాల్లో కొలువైన కేదార్నాథుడి దర్శనం కోసం వెళ్లే భక్తులు అక్కడి వాతావరణానికి సంబంధించిన సమాచారాన్ని తమ మొబైల్ ఫోన్ ద్వారా తెలుసుకోవచ్చు. 2013లో ఒక్కసారిగా వచ్చిన భారీ వరదలకు వేలాది మంది యాత్రికులు కొట్టుకుపోయిన విషయం తెలిసిందే.
గత అనుభవం నేపథ్యంలో ఉత్తరాఖండ్ ప్రభుత్వం రుద్రప్రయాగ్ జిల్లా భౌగోళిక స్వరూపాన్ని డిజిటల్ మ్యాపింగ్ చేసింది. ఈ డిజిటల్ మ్యాప్ అప్లికేషన్ను రుద్రప్రయాగ్ జిల్లా కలెక్టర్ రాఘవ్ లాంగర్ మంగళవారం ప్రారంభించనున్నారు. దీని సాయంతో భక్తులు వాతావరణంలో ఆకస్మిక మార్పులు, రోడ్ల పరిస్థితి గురించి తాజా సమాచారాన్ని మొబైల్ ద్వారా తెలుసుకోవచ్చు.