సహజసుందరం
మేఘాలయం
ప్రెజెంటేషన్: నిర్మలారెడ్డి
ఏడాది పొడవునా చల్లగా, వర్షపాతం అధికంగా ఉండి, హోరుమని దుమికే జలపాతాలకు నెలవై, పచ్చదనంతో ప్రకృతి ఆరాధకులను తనవైపు తిప్పుకొని విస్మయపరిచే ప్రాంతం చిరపుంజి. గిరిజన సంస్కృతులు కొలువుదీరి, అబ్బురపరిచే వన్యప్రాణులు విహరించే ప్రాంతం, ప్రశాంతతకు ఆలవాలమైన ఆలయాలుగల షిల్లాంగ్. ఈశాన్య భారతదేశంలో కొలువైన ఈ ప్రాంతాల సోయగాలను కనులారా వీక్షించిన హైదరాబాద్ తపాలా శాఖలో మార్కెటింగ్ అసిస్టెంట్ డెరైక్టర్ జి.సూర్యనారాయణ పర్యటన అనుభవాలివి...
‘‘మా కుటుంబ సభ్యులతో కలిసి కిందటి నెలలో ఈశాన్యభారతదేశంలోని చిరపుంజిని సందర్శించాలని బయల్దేరాను. చిరపుంజితో పాటు షిల్లాంగ్, అస్సాంలోని గౌహతి పట్టణం సందర్శించాం. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి ఈస్ట్‌కోస్ట్ రైలులో ఉదయం 10 గం.లకు బయల్దేరిన మేము మరుసటి రోజు 4:30 గంటలకు కోల్కత్తా చేరుకున్నాం. అక్కడ నేతాజీ సుభాష్ చంద్రబోస్ విమానాశ్రయం నుంచి విమానయానం ద్వారా షిల్లాంగ్‌కు బయల్దేరాం. హోటల్ గదిలో విశ్రాంతి తీసుకుని మరుసటి రోజు చిరపుంజికి టాక్సీలో బయల్దేరాం. చిరపుంజి చేరడానికి దాదాపు 2 గంటల సమయం పట్టింది.
జలపాతాల హోరు చిరపుంజి...
మేఘాలయ రాష్ట్ర రాజధాని షిల్లాంగ్‌కు 56 కి.మీ దూరంలో తూర్పు ఖాసి హిల్స్ జిల్లాలోని ఒక చిన్న పట్టణం చిరపుంజి. దీనిని సోహ్రా, చురా అని కూడా అంటారు. భూమి మీద అతి తేమగా ఉండే ప్రదేశంగా ఇది ఖ్యాతి చెందింది. షిల్లాంగ్ నుంచి చిరపుంజి వెళ్లే దారంతా పచ్చని ప్రకృతి అందాలను చూసి మైమరచిపోయాం. అదనపు ఆకర్షణగా చిరపుంజిలో అన్నీ జలపాతాలే! ‘నోహ్కాలికై’ జలపాత సోయగమైతే మాటల్లో వర్ణించలేం. దేశంలోనే ఎత్తై జలపాతాలలో ఒకటిగా ‘నోహ్కాలికై’కి పేరుంది. చిరపుంజికి 5 కిలోమీటర్ల దూరంలోనే గల ఈ జలపాతం ఈ ప్రాంతానికి ప్రధాన ఆకర్షణ. ఇక్కడ ఏడాదికి సాధారణ వర్షపాతం 12000 మి.మీ గా నమోదవుతుంది. రికార్డు స్థాయిలో 2500 మి.మీకు పైగా నమోదైన రోజులూ ఉన్నాయి. మేం వెళ్లిన రోజునా వర్షం మమ్మల్ని పలకరిస్తూనే ఉంది. రోడ్డుకి ఇరువైపులా బొగ్గుక్షేత్రాలు, సున్నపురాయి గనులు లెక్కకు మించి ఉన్నాయి. ఇదే ప్రాంతంలో ‘దైనత్లేన్’ అనే మరో జలపాతమూ ఉంది.
గుహల సముదాయం...
జలపాతాల హోరును, పర్వతశ్రేణులను, పచ్చని ప్రకృతిని తిలకిస్తూ అక్కడ ఫొటోలు దిగాం. చూసినంత సేపు చూసి అక్కడ నుంచి గుహల సందర్శనకు బయల్దేరాం. ‘లైమ్‌స్టోన్ కేవ్స్’గా పిలిచే సున్నపురాయి గుహలు చిరపుంజికి 6 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నాయి. ఇక్కడి పర్వతప్రాంతమంతా పచ్చని గడ్డి తివాచీ పరుచుకున్నట్టే ఉంది. ఈ గుహలలో చిన్నవి, పెద్దవి కలుపుకొని ఇంచుమించు వందకుపైగా ఉంటాయి. రాకాసి జంతువుల్లా రకరకాల రూపాల్లో గుహ లోపలి దృశ్యాలు అబ్బురపరిచాయి. చిరపుంజిలో లివింగ్ బ్రిడ్జికి పెట్టింది పేరు. వందల ఏళ్లుగా చిరపుంజీ వాసులు చెట్ల వేళ్లనే వంతెనలుగా మార్చుకొని వాడుకుంటున్నారు. ఇప్పటికీ ఉపయోగిస్తున్న పురాతన బ్రిడ్జి వయసు 500 ఏళ్లకు పైగా ఉంటుందని అంచనా!
ఉత్సాహభరితం షిల్లాంగ్...
ఇక్కడి గిరిజన సంస్కృతులు, డాన్ బాస్కో సెంటర్, మ్యూజియంను తప్పక సందర్శించాల్సిందే! షిల్లాంగ్ శిఖరం అత్యంత సుందరమైనది. దీనికి సంబంధించిన కథనాలు ఎన్నో ప్రాచుర్యంలో ఉన్నాయి. అందులో ప్రాచుర్యంలో ఉన్న ఓ కథ తెలిసింది. లిర్ అనే కన్య మగబిడ్డకు జన్మనిచ్చి, ఆ బిడ్డను ఒక తోటలో పాతిపెడుతుంది. కొన్ని ఏళ్ల తర్వాత అర్ధరాత్రి తలుపు దగ్గర శబ్దం రావడంతో మెలకువ వచ్చి లేచి చూస్తే ఒక అందమైన యువకుడు లోపలికి వచ్చి ‘అమ్మా భయపడవద్దు.. నాడు తోటలో పాతిపెట్టిన బిడ్డను నేనే’ అని చెప్పాడు. వెంటనే ఆమె అతనిని ‘షిల్లాంగ్’ అని ఆనందంగా పిలుస్తుంది. ‘షిల్లాంగ్’ అంటే ‘స్వతహాగా, స్వయంగా’ పెరిగిన అని అర్థం. సహజసిద్ధమైన ప్రాంతంగా అవడం వల్ల ఆ పేరు వచ్చిందని చెబుతారు.
ఎలిఫెంట్ హిల్స్...
షిల్లాంగ్‌లో ఎత్తై, అతి సుందరమైన మరో ప్రదేశం ఎలిఫెంట్ జలపాతం. దీనిని ఆంగ్లేయుల కాలంలో గుర్తించారు. జంతువులలో ఏనుగు ఎంత పెద్దదో జలపాతాలలో ఎలిఫెంట్ హిల్స్ అంత పెద్దది అని చెబుతారు. కొండ ఎడమభాగం ఏనుగు ఆకారంలో ఉండేదని, 1897లో భూకంపం రావడం వల్ల ఆ ఆకారం గల కొండ కొట్టుకుపోయిందని టూరిస్ట్ గైడ్ తెలిపారు. ఇక్కడ మరో ఆకర్షణీయ ప్రాంతం ‘లేడీ హైదర్ పార్క్’ తప్పక సందర్శించాల్సిన ఉద్యానవనం.
సీతాకోకచిలుకలు ఎన్నో...
షిల్లాంగ్‌కి 2 కిలోమీటర్ల దూరంలో, ఎలిఫెంట్ గుహలకు దాదాపు 9 కిలోమీటర్ల దూరంలో బటర్‌ఫ్లై మ్యూజియం ఉంది. షార్జా, దుబాయ్, ఒమన్, పొలస్కా, పనామా మొదలగు ప్రపంచంలో గల విభిన్న జాతుల రంగురంగుల సీతాకోక చిలుకలు ఇందులో ఉన్నాయి.
జనవరి 17 న మొదలైన మా ప్రయాణం 27న ముగిసింది. పది రోజుల పాటు సాగిన ఈశాన్యభారతదేశ ప్రయాణం మదినిండా ఆనందోల్లాసాలను కలిగించింది. ఈ ప్రయాణం సరికొత్త అనుభవాన్ని మిగిల్చింది.
తూర్పు స్కాట్లాండ్‌గా పిలబడే షిల్లాంగ్‌ని అత్యద్భుత పర్యాటక కేంద్రంగా చెప్పవచ్చు. విశాల మైదానాలలోనూ, పర్వతాల మీద పచ్చదనం, జలపాతాలు, మంత్రముగ్ధులను చేసే శిఖరాలు, అనేక ఆసక్తికరమైన విషయాలతో షిల్లాంగ్ పర్యాటకులకు ఆహ్వానం పలుకుతోంది.