వార్డెన్ నరకం చూపుతున్నారు
రంపచోడవరం, న్యూస్‌లైన్ : తమకు మంచి భోజనం పెట్టడం లేదని, పెట్టేది కూడా అరకొరగా ఉంటోందని రాజమండ్రిలోని గిరిజన మేనేజ్మెంట్ హాస్టల్ విద్యార్థులు గురువారం ఐటీడీఏ పీఓ నాగరాణికి ఫిర్యాదు చేశారు. వార్డెన్ కృష్ణమోహన్ తమకు నరకం చూపిస్తున్నారంటూ వాపోయారు. రంపచోడవరం ఐటీడీఏ పీఓ సి. నాగరాణిని వారు గురువారం కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. మంచి భోజనం పెట్టడం లేదని, అడిగితే పోయి ఐటీడీఓ ిపీఓతో చెప్పుకోండి అంటూ తీవ్ర పదజాలంతో దూషిస్తున్నట్టు వారు తెలిపారు.ప్రతీ రోజూ కనీసం 10 మందికి ఆహారం సరిపోవడం లేదన్నారు.
ఏటీడబ్ల్యూఓ పల్లయ్య హాస్టల్‌ను సందర్శించినప్పుడు వార్డెన్ మెను ప్రకారం ఆహారం అందించడం లేదని చెప్పామని, విద్యార్థులకు ఇష్టప్రకారం ఆహారం ఇవ్వాలని ఆయన వార్డెన్‌కు చెప్పినప్పటికీ పట్టించుకోలేదన్నారు. 16 మంది ఇంటర్ విద్యార్థులకు హాస్టల్లో ఇప్పటికి ప్రవేశ నెంబర్లు ఇవ్వలేదన్నారు. దాని గురించి అడిగితే రూ. 50 వేలు అవుతుందని, అది మీరు పెట్టుకుంటారా అంటూ వార్డెన్ విరుచుకుపడుతున్నారన్నారు. ఓఎన్జీసీ హాస్టల్‌కు ఇచ్చిన పుస్తకాలు కూడా చదువుకునేందుకు ఇవ్వడం లేదన్నారు. బయట వ్యక్తులను తీసుకువచ్చి తమను బెదిరిస్తున్నారని తెలిపారు.
దీనిపై స్పందించిన పీఓ నాగరాణి వార్డెన్‌ను విధుల నుంచి తప్పిస్తామని, విచారణ అనంతరం చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సీడబ్ల్యూసీ చైర్పర్సన్ ధామస్ పల్లిదానంకు విద్యార్థులు తమ సమస్యలు, వార్డెన్ వ్యవహరిస్తున్న తీరుపై ఫిర్యాదు చేశారు. విద్యార్థులు ఆందోళనకు సెంటర్ ఫర్ రైట్స్ రాష్ట్ర అధ్యక్షుడు బాలు అక్కిస, పీడీఎస్‌యూ జిల్లా మాజీ అధ్యక్షుడు రమణ, డివిజన్ అధ్యక్షుడు కె.భానుప్రసాద్, కె.విజయకుమార్ మద్దతు తెలిపారు. పీఎంఆర్సీ వద్ద కొద్ది సేపు బైఠాయించారు.