ఆందోళనలో చెరకు రైతులు
జహీరాబాద్: ‘ట్రైడెంట్’ చక్కెర కర్మాగార యాజమాన్యం ఈ సారి కూడా చెరకు రైతుకు చేదును మిగిల్చింది. సామర్థ్యం పెంచి కర్మాగారం పరిధిలో సాగైన పంటనంతా కొనాలని రైతులు డిమాండ్ చేస్తుండగా, 2014-15 క్రషింగ్ సీజన్ సామర్థ్యం పెంచే యోచనను యాజమాన్యం దాదాపుగా విరమించుకుంది.
రైతుల కోరిక మేరకు తొలుత సామర్థ్యం పెంచాలనుకున్న యాజమాన్యం ఆ తర్వాత పలు కారణాలతో సామర్థ్యం పెంపు నిర్ణయాన్ని మానుకున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి కర్మాగారం సామర్థ్యం రోజుకు 3,500 టన్నుల మేర కలిగి ఉంది. దాన్ని సీజన్‌కు గాను 3,300 టన్నులకు పెంచాలని యోచించింది. నవంబర్ రెండో వారంలో క్రషింగ్ ఉన్నందున ఇప్పటికిప్పుడు విస్తరణ పనులు ప్రారంభిస్తే సీజన్ ఆరంభానికల్లా పూర్తి చేయలేని పరిస్థితి ఎదురవుతుందనే ఉద్దేశంతో అయితే ఆఖరు నిమిషంలో ఈ నిర్ణయాన్ని మార్చుకుంది. దీంతో రైతులు తమ చెరకును వ్యయప్రయాసల కోర్చి ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లాల్సిన పరిస్థితి తలెత్తింది.
వచ్చే సీజన్‌కు సామర్థ్యం పెంచేలా చర్యలు
ప్రస్తుతం కర్మాగారం సామర్థ్యం రోజుకు 3,500ల టన్నులుగా ఉంది. దీన్ని ప్రస్తుతం రోజుకు 3,800 టన్నులకు పెంచాలని, ఆ తర్వాత 2015-16 క్రషింగ్ సీజన్‌కు 4,200 టన్నుల మేరకు చేర్చాలని యాజమాన్యం పరిశీలించినట్లు సమాచారం. నాలుగు నెలల క్రితం కర్మాగారం ఎం.డి రాజశ్రీ జహీరాబాద్ వచ్చిన సందర్భంగా రైతులు సామర్థ్యం పెంచే విషయాన్ని ఆమె దృష్టికి తీసుకెళ్లారు. ఇందుకు ఆమె సుముఖత కూడా వ్యక్తం చేశారు.
అయితే ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ సీజన్‌కు కాకుండా 2015-16 క్రషింగ్ సీజన్లో ఎట్టి పరిస్థితుల్లోనైనా క్రషింగ్ సామర్థ్యాన్ని పెంచాలనే యోచనలో యాజమాన్యం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే కర్మాగారం సామర్థ్యాన్ని మొక్కుబడిగా పెంచితే ఏ మాత్రం ప్రయోజనం ఉండబోదని, 6 వేల టన్నులకు పెంచే విషయాన్ని యాజమాన్యం సీరియస్‌గా పరిశీలించాలని రైతాంగం డిమాండ్ చేస్తోంది.
సాగు పెరిగినా...పెరగని క్రషింగ్
1973 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం నిజాం షుగర్స్ లిమిటెడ్-3 కర్మాగారాన్ని జహీరాబాద్ మండలంలోని కొత్తూర్(బి) గ్రామంలో నిర్మించి ప్రారంభించింది. అప్పట్లో రోజుకు 1,250 టన్నుల సామర్థ్యం మేర కర్మాగారాన్ని ఏర్పాటు చేశారు. పలు దశల్లో కర్మాగారం క్రషింగ్ సామర్థ్యాన్ని పెంచుకుంటూ వస్తోంది.
ప్రతి ఏటా జోన్ పరిధిలో చెరకు పంట సాగు విస్తీర్ణం పెరగడంతో పాటు పంట దిగుబడులు కూడా పెరుగుతుండడంతో కర్మాగారం పూర్తి స్థాయిలో క్రషింగ్ చేయలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో రైతులు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తూ వస్తున్నారు. సంగారెడ్డిలోని గణపతి, మహబూబ్‌నగర్ జిల్లాలోని కొత్తకోట కర్మాగారాలతో పాటు పక్కనే ఉన్న కర్ణాటక ప్రాంతాలకు కూడా రైతులు చెరకును తరలించుకుంటున్నారు. కొందరు రైతులు విధిలేని పరిస్థితుల్లో దళారులను ఆశ్రయించి తక్కువ ధరకు చెరకును విక్రయించుకుంటున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో కర్మాగారం సామర్థ్యం పెంచాల్సిన అవసరం ఏర్పడింది. అయినా యాజమాన్యం ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కర్మాగారం జోన్ పరిధిలోని జహీరాబాద్, కోహీర్, ఝరాసంగం, న్యాల్కల్, రాయికోడ్ మండలాల్లో ప్రస్తుతం అధికారికంగా 24వేల ఎకరాల్లో చెరకు పంట సాగులో ఉంది. అనధికారికంగా ఇది 28 వేల ఎకరాల్లో ఉంటుందని అంచనా.
పూర్తిస్థాయిలో జరగని క్రషింగ్
ప్రస్తుతం జహీరాబాద్ జోన్ పరిధిలో ఉన్న చెరకు పంటను ట్రైడెంట్ కర్మాగారం పూర్తి స్థాయిలో క్రషింగ్ చేయడం లేదు . గత దశాబ్ద కాలంగా ఇదే పరిస్థితి నెలకొంటూ వస్తోంది. జోన్ పరిధిలో సుమారు 9 లక్షల టన్నుల మేర చెరకు పంట ఉత్పత్తి కానుంది. ఇందులో ట్రైడెంట్ కర్మాగారం సుమారు 4.75 లక్షల టన్నుల చెరకును మాత్రమే క్రషింగ్ చేసే అవకాశం ఉంది. గత సంవత్సరం 4.65 లక్షల టన్నుల మేర చెరకును క్రషింగ్ చేసింది.
దీనిని దృష్టిలో ఉంచుకుని రైతులు చెరకును ఇతర కర్మాగారాలకు తరలించుకునేందుకే ఆసక్తి చూపుతున్నారు. ఈ సంవత్సరం వర్షాభావం కూడా ఏర్పడడంతో భూగర్భ జలాలు అడుగంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో పంట ఎండిపోయే పరిస్థితి ఏర్పడుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. సాధ్యమైనంత మేర ఇతర కర్మాగారాలకు చెరకు పంటను తరలించుకునేందుకే రైతులు ఆసక్తి చూపుతున్నారు.
ఆలస్యం చేస్తే కూలీ, రవాణా చార్జీల రేట్లు భారీగా పెరిగి పెట్టుబడులు కూడా దక్కని పరిస్థితి వస్తుందంటున్నారు. జహీరాబాద్‌లోని ట్రైడెంట్ కర్మాగారం సామర్థ్యాన్ని రోజుకు 6 వేల టన్నుల మేర పెంచినట్లయితేనే ప్రయోజనం ఉంటుందని రైతులు పేర్కొంటున్నారు. ఈ విషయంలో యాజమాన్యం ఏ మేరకు శ్రద్ధ తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.