బరిలో నేరచరితులు
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్రంలో ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో 55 మందికి నేర చరిత్ర ఉందని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్), కర్ణాటక ఎలక్షన్ వాచ్లు పేర్కొన్నాయి.
మంగళవారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ సంస్థల రాష్ట్ర కో-ఆర్డినేటర్లు ప్రొఫెసర్ త్రిలోచన్ శాస్త్రి, హరీశ్ నరసప్ప, వాసుదేవ శర్మ, కాత్యాయిని చామరాజ్, రవి జయరామయ్యలు మాట్లాడుతూ అభ్యర్థులు నామినేషన్ల సందర్భంగా సమర్పించిన స్వీయ అఫిడవిట్ల ఆధారంగా వారి నేర చరిత్ర, ఆర్థిక, ఇతర నేపథ్య వివరాలను విశ్లేషించినట్లు వివరించారు.
రాష్ట్రంలో మొత్తం 434 మంది అభ్యర్థులు పోటీ చేస్తుండగా ఇద్దరి అఫిడవిట్లు లభ్యం కాలేదని తెలిపారు. 30 మంది అభ్యర్థులపై తీవ్ర నేరారోపణలు ఉన్నాయని వెల్లడించారు. పార్టీల పరంగా కాంగ్రెస్లో ఆరు గురు, బీజేపీలో తొమ్మిది మంది, జేడీఎస్లో ఎనిమిది మంది, 194 మంది ఇండిపెండెంట్లకు గాను 14 మందిపై క్రిమినల్ కేసులున్నాయని చెప్పారు. బెంగళూరు దక్షిణ నియోజక వర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న ప్రమోద్ ముతాలిక్పై హత్యా యత్నం కేసులు ఉన్నాయని అఫిడ్విట్లలో పేర్కొన్నట్లు తెలిపారు.
కోటీశ్వరులు
ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో 118 మంది కోటీశ్వరులున్నారు. కాంగ్రెస్లో 27 మంది, బీజేపీలో 26 మంది, జేడీఎస్లో 21 మంది, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)లో 12 మంది రూ.కోటికి పైగా ఆస్తులు కలిగి ఉన్నారు. బెంగళూరు దక్షిణ నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి నందన్ నిలేకణి రూ.7,710 కోట్ల ఆస్తులు, బెంగళూరు గ్రామీణ నియోజక వర్గం నుంచి పోటీ చేస్తున్న జేడీఎస్ అభ్యర్థి ఆర్. ప్రభాకర రెడ్డి రూ.224 కోట్లు, బెంగళూరు సెంట్రల్ నుంచి పోటీ చేస్తున్న ఆప్ అభ్యర్థి వీ. బాలకృష్ణన్ రూ.189 కోట్ల ఆస్తులతో మొదటి మూడు స్థానాల్లో నిలిచారు.
బీదర్లో ఇండిపెండెంట్ అభ్యర్థి మీర్జా షఫీ బేగ్, బళ్లారిలో బీఎస్పీ అభ్యర్థి రాముడు, హావేరిలో సర్వ జనతా పార్టీ అభ్యర్థి బసవెంతప్ప హొన్నప్ప హుల్లట్టి, ఉడిపి-చిక్కమగళూరులో స్వతంత్ర అభ్యర్థి జీ. మంజునాథలు తమకు ఆస్తులే లేవని ప్రకటించారు. మండ్యలో భారతీయ డాక్టర్ అంబేద్కర్ జనతా పార్టీ అభ్యర్థి కే. మహదేవప్పకు రూ.500, బెంగళూరు సెంట్రల్లో ఇండిపెండెంట్ డీ. ఆంబ్రోస్కు రూ.575, కోలారులో స్వతంత్ర అభ్యర్థి ఎంఎస్. నారాయణ స్వామికి రూ.వెయ్యి విలువైన ఆస్తులు మాత్రమే ఉన్నాయట.
ఇక అప్పుల విషయానికొస్తే...ఆర్. ప్రభాకర రెడ్డి రూ.221.80 కోట్లు, చిక్కబళ్లాపురం జేడీఎస్ అభ్యర్థి హెచ్డీ. కుమారస్వామి రూ.72.96 కోట్లు, బెల్గాం బీజేపీ అభ్యర్థి సురేశ్ అంగడి రూ.36.62 కోట్లుగా చూపారు. 255 మంది అభ్యర్థులు ఆదాయ పన్ను వివరాలను వెల్లడించలేదు.
ఆరుగురు నిరక్షరాస్యులు
ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థుల్లో ఆరుగురు నిరక్షరాస్యులు కాగా 190 మంది పీయూసీ లేదా అంతకన్నా తక్కువ విద్యార్హత కలిగి ఉన్నారు. 217 మంది గ్రాడ్యుయేషన్ లేదా అంతకన్నా ఎక్కువ విద్యార్హతతో ఉన్నారు. 25-50 ఏళ్ల వయసు వారు 261 మంది పోటీలో ఉండగా, 51-70 ఏళ్ల వారు 150 మంది, 71-80 ఏళ్ల వారు 17 మంది బరిలో నిలిచారు. ఎనభై ఏళ్లు పైబడిన ఓ అభ్యర్థి కూడా పోటీ చేస్తున్నారు. మహిళలు 20 మంది రంగంలో ఉన్నారు.
రెడ్ అలర్ట్ నియోజక వర్గాలు
బెంగళూరు సెంట్రల్లో ఐదుగురు, ధార్వాడ, బెల్గాం, బళ్లారి, కొప్పళ నియోజక వర్గాల్లో నలుగురేసి, బీదర్, బిజాపుర, చిక్కోడిలలో ముగ్గురు చొప్పున నేర చరితులు పోటీలో ఉన్నారు.
పెరిగిన ఎంపీల ఆస్తులు
ఈ ఎన్నికల్లో 21 మంది సిట్టింగ్లు తిరిగి పోటీ చేస్తున్నారు. 2009 ఎన్నికలప్పుడు వారి సగటు ఆస్తుల విలువ రూ.6.82 కోట్లు కాగా ప్రస్తుతం రూ.20.50 కోట్లకు ఎగబాకింది. అంటే..ఈ ఐదేళ్లలో ఒక్కొక్కరికి సగటున రూ.13.67 కోట్ల ఆస్తులు పెరిగాయి. ఆస్తుల వృద్ధి 200 శాతంగా నమోదైంది. 2009లో కుమారస్వామి రూ.49 కోట్ల ఆస్తులను చూపించగా, ఇప్పుడు రూ.167 కోట్లుగా పేర్కొన్నారు. అలాగే బీజేపీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న పీసీ. మోహన్ (బెంగళూరు సెంట్రల్) ఆస్తులు రూ.5 కోట్ల నుంచి రూ.47 కోట్లకు, జీఎస్. బసవరాజు (తుమకూరు) ఆస్తులు రూ.5 కోట్ల నుంచి రూ.27 కోట్లకు, సురేశ్ అంగడి ఆస్తులు రూ.22 కోట్ల నుంచి రూ.41 కోట్లకు పెరిగాయి.