టీఆర్ఎస్తోనే సర్వతోముఖాభివృద్ధి
-టీఆర్ఎస్ ఆస్ట్రేలియా శాఖ అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి
మెల్ బోర్న్ :
దేశవ్యాప్తంగా ఎంపికైన 30 ఆకర్షణీయ నగరాల జాబితాలో కరీంనగర్ కు స్థానం దక్కడం పట్ల టీఆర్ఎస్ ఆస్ట్రేలియా శాఖ మెల్ బోర్న్లో సమావేశమై హర్షం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ఆస్ట్రేలియా శాఖ అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి మాట్లాడుతూ.. స్మార్ట్ సిటీ జాబితాలో కరీంనగర్ కు చోటు దక్కడానికి మంత్రి కేటీఆర్, ఎంపీ వినోద్ ఎంతగానో కృషి చేశారని కొనియాడారు. రెండేళ్లుగా కరీంనగర్‌ను స్మార్ట్ సిటీ జాబితాలో చేర్చడానికి చేపడుతున్న అనేక కార్యక్రమాలు, కేంద్రానికి చేసిన విజ్ఞప్తులకు నేడు ఫలితం దక్కిందన్నారు. ఇటీవలే ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా వినోద్ తమను కలిసినప్పడు స్మార్ట్ సిటీ దిశగా అడుగులు వేస్తున్నప్పటి నుండి చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాల గురించి తమతో చర్చించారని నాగేందర్ రెడ్డి అన్నారు.
కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీ మిషన్ ఆండ్ అర్బన్ డెవలప్మెంట్ పథకం ప్రవేశపెట్టినప్పటి నుంచి కరీంనగర్ నగరాన్ని ఇందులో చేర్చడానికి ఎంపీ వినోద్ ఎంతో శ్రమించారని దీనికి అనుగుణంగానే నగర పాలక సంస్థలో సాంకేతిక విజ్ఞానాన్ని అనుసంధానం చేశారన్నారు. బంగారు తెలంగాణ సాధించే దిశగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెడుతున్న వినూత్న పథకాలతో జరుగుతున్న అభివృద్ధిని ప్రతిబింబిస్తూ తెలంగాణలోని జిల్లాలు ఆకర్షణీయ నగరాలుగా ఎంపికవ్వడం ఎంతో గర్వకారణమని తెలిపారు. ఈ సమావేశంలో ఉపాధ్యక్షులు డా అనిల్ రావు చీటీ, విక్టోరియా ఇంచార్జి సాయి రామ్ ఉప్పు , యూత్ వింగ్ ఇంచార్జి సనీల్ రెడ్డి బాసిరెడ్డి, అధికార ప్రతినిధి రాకేష్ లక్కారసులతోపాటూ వేణునాథ్, సాయి యాదవ్, అరవింద్ ,శరన్, ప్రశాంత్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.