గువ్వలపై గవర్నర్కు ఫిర్యాదు
హైదరాబాద్: అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజుపై కాంగ్రెస్ పార్టీ.. గవర్నర్ నరసింహన్కు ఫిర్యాదు చేసింది. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డిపై బాలరాజు చేయి చేసుకున్నాడని, వెంటనే ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ మేరకు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రతిపక్ష నేత జానారెడ్డి తదితర నాయకుల బృందం శనివారం రాజ్భవన్లో గవర్నర్ను కలిసి వినతి పత్రం ఇచ్చింది.
శుక్రవారం జరిగిన మహబూబ్నగర్ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో కాంగ్రెస్ నేత, మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డిపై అధికార టీఆర్ఎస్కు చెందిన అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు చేయి చేసుకున్న దృశ్యాలు టీవీ ఛానెళ్లలో ప్రసారమయ్యాయి. ఎమ్మెల్యేపై దాడిని తీవ్రంగా పరిగణించిన కాంగ్రెస్ పార్టీ జిల్లా బంద్కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. హైదరాబాద్లో శనివారం జరిగిన టీపీసీసీ సమావేశంలోనూ ఇదే అంశాన్ని చర్చించిన నేతలు గువ్వలపై గవర్నర్ కు ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. బాధిత ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి.. మాజీ మంత్రి డీకే అరుణకు సోదరుడు కావడం గమనార్హం.