తెలంగాణలో అప్రజాస్వామిక ప్రభుత్వం
మంత్రి తలసానిని బర్తరఫ్ చేయాలి
రాష్ట్రపతికి టీటీడీపీ నేతల ఫిర్యాదు
కేంద్ర ఎన్నికల కమిషనర్‌తోనూ భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో టీఆర్ఎస్ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను రాజ్యాంగ విరుద్ధంగా తమ పార్టీలో చేర్చుకుంటోందని తెలంగాణ టీడీపీ నేతలు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ఫిర్యాదు చేశారు. తెలంగాణలో అప్రజాస్వామిక ప్రభుత్వం నడుస్తోందని, రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న టీఆర్ఎస్ గుర్తింపును రద్దు చేయాలని ఎన్నికల కమిషనర్ బ్రహ్మకు ఫిర్యాదు చేశారు. టీటీడీఎల్పీ నాయకుడు ఎర్రబెల్లి దయాకర్‌రావు నేతృత్వంలోని ప్రతినిధి బృందం మంగళవారం ముందుగా రాష్ట్రపతితో, అనంతరం ఎన్నికల కమిషనర్‌తో భేటీ అయింది. ప్రతినిధి బృందంలో టీడీపీ ఎంపీలు సి.మల్లారెడ్డి, జి.మోహనఖరావు, గుండు సుధారాణి, ఎమ్మెల్యేలు రేవంత్‌రెడ్డి, ఎస్.వెంకటవీరయ్య, జి.సమ్మయ్య, ఎం.కిషన్‌రెడ్డి, కేపీ వివేకానంద, ఎం.గోపీనాథ్, ఎ.గాంధీ, ఎం.కృష్ణారావు, ఎస్.రాజేందర్‌రెడ్డి, మండలిలో టీడీపీ ఫ్లోర్ లీడర్ నర్సారెడ్డి, మాజీ ఎంపీ రమేశ్ రాథోడ్, మాజీ మంత్రి ఉమా మాధవరెడ్డి, మాజీ ఎమ్మెల్యే అన్నపూర్ణమ్మ, ఎం. అమర్‌నాథ్‌బాబు తదితరులు ఉన్నారు.
అనంతరం ఏపీ భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ.. తెలంగాణలో ప్రజాస్వామ్య విలువలు కాపాడే పరిస్థితి లేక బాధతో ఢిల్లీ వచ్చాం. టీడీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్మన్లు, ఎంపీపీలు, కౌన్సిలర్లు, మున్సిపల్ చైర్మన్లను రాజ్యాంగ విరుద్ధంగా టీఆర్ఎస్లో చేర్చుకునే అంశాన్ని రాష్ట్రపతికి వివరించామని చెప్పారు. తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను వెంటనే బర్తరఫ్ చేయాలని, ఈ అంశంపై కోర్టుకు వెళ్లినట్టు తెలిపారు. ఇతర పార్టీల నుంచి టీఆర్ఎస్లో చేర్చుకున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై అనర్హత వేటు వేయకుండా గవర్నర్‌పై, కౌన్సిల్ చైర్మన్లపై తెలంగాణ సీఎం కేసీఆర్ ఒత్తిడి తీసుకువస్తున్నారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు.