అన్ని దారులు రాజధాని వైపే
- బహిరంగ సభకు తరలిన గులాబీ దండు
- టీఆర్ఎస్ వాహనాలతో కిటకిటలాడిన రహదారులు
జిల్లాలోని అన్ని దారులు హైదరాబాద్‌లో వైపు దారితీశాయి. పరేడ్‌గ్రౌండ్స్‌లో టీఆర్ఎస్ ఆవిర్భావ సభలో పాల్గొనేందుకు సోమవారం జిల్లా నుంచి గులాబీ దండు తరలింది. నాయకులు, కార్యకర్తలు పార్టీ ఆవిర్భావసభకు ఉత్సాహంగా బయలుదేరి వెళ్లారు. దారి పొడవునా జై తెలంగాణ.. కేసీఆర్ జిందాబాద్ నినాదాలు హోరెత్తాయి. బహిరంగసభకు వెళ్లే వాహనాలతో రహదారులన్నీ కిటకిటలాడాయి.
సాక్షి, సంగారెడ్డి: పార్టీ అధికారంలోకి వచ్చాక తొలిసారిగా జరుపుకుంటున్న ఆవిర్భావ దినోత్సవం కావడంతో గులాబీ శ్రేణులు పరేడ్ గ్రౌండ్స్ బహిరంగ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ క్రమంలో నేతలందరూ పెద్ద సంఖ్యలో జనసమీకరణతో రాజధానికి బయలుదేరారు. టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మురళీయాదవ్ నేతృత్వంలో జహీరాబాద్ ప్రాంత నాయకులు భారీ సంఖ్యలో హైదరాబాద్ వెళ్లారు. జిల్లా కేంద్రం సంగారెడ్డి నుంచి పదివేల మంది నాయకులు, కార్యకర్తలు బహిరంగసభకు బయలుదేరి వెళ్లారు. సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ కార్యకర్తల వాహనాల్లో కొద్దిసేపు వారితో కలిసి ప్రయాణించారు.
నియోజకవర్గంలోని మూడు మండలాలకు చెందిన జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ, సర్పంచ్‌లు బహిరంగసభకు వెళ్లారు. గణేష్‌గడ్డ వద్ద టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మురళీయాదవ్, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ కలిసి బహిరంగసభకు కార్యకర్తలకు స్వాగతం పలికారు. పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల నుంచి నాయకులు, కార్యకర్తలు వాహనాల్లో హైదరాబాద్ బయలుదేరారు. సిద్దిపేట నుంచి టీఆర్ఎస్ ఆవిర్భావ సభకు సుమారు 320 వాహనాల్లో కార్యకర్తలు, నాయకులు తరలి వెళ్లారు. హైదరాబాద్‌కు బయలు దేరిన వారిలో మున్సిపల్మాజీ చైర్మన్ రాజనర్సు, వైస్ చైర్మన్ చిన్న, మాజీ కౌన్సిలర్లు మచ్చవేణుగోపాల్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
సీఎం కేసీఆర్ సొంత నియోజకవర్గం గజ్వేల్ నుంచి టీఆర్ఎస్ బహిరంగ సభకు పార్టీ శ్రేణులు భారీగా తరలివెళ్లాయి. రాష్ట్రభారీ నీటి పారుదల శాఖామాత్యులు హరీష్‌రావు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిల పర్యవేక్షణలో జనాలను తరలించారు. ప్రజ్ఞాపూర్ నుంచి ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి బహిరంగ సభకు వెళ్లే వాహనాలను పంపించారు. హైదరాబాద్‌లో సోమవారం జరిగిన టీఆర్ఎస్ ఆవిర్భావ సభకు మెదక్ నియోజకవర్గం నుంచి సుమారు 21వేల మంది తరలివెళ్లారు.
నర్సాపూర్ నియోజకవర్గం నుంచి స్థానిక ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు తరలి వెళ్లారు. నియోజకవర్గ కేంద్రమైన నర్సాపూర్‌లోని అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాలలు వేసి సభకు తరలి వెళ్తున్న బస్‌ను జెండా ఊపి ప్రారంభించారు. టీఆర్ఎస్ పార్టీ బహిరంగసభకు అందోలు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని అందోలు, పుల్కల్, అల్లాదుర్గం, రేగోడ్, మునిపల్లి, రాయికోడ్, టేక్మాల్ మండలాల నుంచి సుమారుగా 100 ఆర్టీసీ బస్సులలో తరలివెళ్లారు.
టీఆర్ఎస్ సభకు జహీరాబాద్ నియోజకవర్గం నుంచి పార్టీ శ్రేణులు భారీగా తరలి వెళ్లాయి. 150కి పైగా వాహనాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు బయలు దేరి వెళ్లారు. 54 ఆర్టీసీ బస్సులు, 70కి పైగా స్కూలు బస్సులతో పాటు ప్రత్యేక వాహనాల్లో కూడా కార్యకర్తలు తరలి వెళ్లారు. సభకు తరలి వెళ్లిన వారిలో మాజీ మంత్రి ఎం.డి.ఫరీదుద్దీన్, నియోజకవర్గం ఇన్చార్జి కె.మాణిక్‌రావులతో పాటు మండల పార్టీ అధ్యక్షులు, గ్రామ కమిటీ నాయకులు, ప్రజా ప్రతినిధులు ఉన్నారు.
టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి భూపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో నారాయణఖేడ్ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో బహిరంగసభకు బయలుదేరి వెళ్లారు. అంచనాల కమిటీ చైర్మన్ దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ ఆవిర్భావ సభకు నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో చేగుంట నుంచి తరలి వెళ్లారు.