ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో కోచింగ్!
► ‘ఓటుకు కోట్లు’ కేసులో నిందితులకు ముందస్తు తర్ఫీదు
► ఏ ప్రశ్నకు ఏం సమాధానం చెప్పాలనే అంశంపై ముందే శిక్షణ
► అందరూ ఒకే జవాబు చెబుతుండడంతో విస్తుపోతున్న ఏసీబీ అధికారులు
► విచారణ కు ముందు, తర్వాత పార్టీ కార్యాలయానికి వెళ్లాల్సిందే!
► ‘ముఖ్య నేత’ ఆధ్వర్యంలో శిక్షణ కేంద్రం
సాక్షి, హైదరాబాద్: ఏ ప్రశ్న వేస్తే ఏం సమాధానం చెప్పాలి..? ఏ ప్రశ్నకు మౌనం దాల్చాలి..? ఏం అడిగితే తలాతోకా లేని జవాబు చెప్పాలి..? ఇదేదో ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులకు ఇచ్చే తర్ఫీదు కాదు! ‘ఓటుకు కోట్లు’ కేసులో ఏసీబీ ముందు విచారణకు హాజరయ్యే నిందితులు, సాక్ష్యులకు టీడీపీ కార్యాలయమైన ఎన్టీఆర్ ట్రస్టు భవన్లో ఇస్తున్న ముందస్తు కోచింగ్!! విచారణాధికారులు ఏ ప్రశ్న వేస్తారు.. దానికి ఎలాంటి సమాధానాలివ్వాలి అన్న అంశంపై న్యాయవాదుల బృందం వారికి శిక్షణ ఇస్తున్నట్లు ఏసీబీ గుర్తించింది. నోటీసులు అందుకున్న ప్రతి ఒక్కరూ ఒకే రకమైన సమాధానాలు చెప్పడం చూసి విస్తుపోయిన ఏసీబీ అధికారులు అసలు విషయం ఏమిటని ఆరా తీస్తే ఈ సంగతి బయటపడింది.
కొందరైతే ప్రశ్నపత్రం ముందే లీకైందా అన్నట్లు.. ఏసీబీ ప్రశ్నలకు తడుముకోకుండా సమాధానాలు చెప్పడం, మరికొన్నింటికి మౌనం దాల్చడం, చాలా వాటికి పొంతన లేని సమాధానాలు చెప్పడం లాంటివి చేస్తున్నారు. కేసులో అరెస్టైన సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మొదలు మంగళవారం విచారణకు హాజరైన శ్రీనివాసులునాయుడు దాకా.. విచారణలో వారు చెప్పిన సమాధానాల్లో చాలా అంశాలు అధికారులు అవాక్కయ్యేలా ఉన్నాయని ఏసీబీ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. ఓ వ్యక్తికి నోటీసు ఇచ్చారంటే ఇక వారికి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో మాక్ విచారణ మొదలవుతోంది. అంతేకాదు విచారణకు వచ్చే రోజున, తిరిగి వెళ్లేటప్పుడు ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌కు వెళ్లాల్సిందే. విచారణ తర్వాత ఏసీబీ అడిగిందేమిటి? వారు చెప్పిందేమిటనేది మళ్లీ అక్కడ వివరిస్తున్నారు.
తర్ఫీదు ఇస్తున్నదెవరు?
‘ఓటుకు కోట్లు’ కేసులో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు రూ.50 లక్షలు ఇస్తూ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడటం, నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోన్లో మాట్లాడిన ఆడియో రికార్డులు బయటపడటంతో ఈ కేసు సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. దీంతో ఈ కేసులో టీడీపీ నేతలు కొందరిని ఏసీబీ ముందుకు వెళ్లకుండా చేయడం, విచారణకు హాజరయ్యే వారికి అవసరమయ్యే సాయం అందించడం పనిగా పెట్టుకున్నారని ఏసీబీ వర్గాలు చెపుతున్నాయి. ఈ కేసులో సూత్రధారులు, పాత్రధారులు ఎవరనే విషయం స్పష్టమైనప్పటికీ వాటిని న్యాయస్థానాల్లో నిరూపించడం కోసం ఏసీబీ పక్కాగా ఆధారాలు సేకరిస్తోంది. అందుకు అనుగుణంగా అనుమానితులందరికీ నోటీసులు ఇచ్చి విచారిస్తోంది.
అయితే విచారణకు వారు సహకరించకుండా ఉండేందుకు ఎన్టీఆర్ ట్రస్టు భవన్ కేంద్రంగా ఓ ‘ముఖ్యనేత’ నేతృత్వంలో కొందరు ప్రముఖులు ఒక విభాగాన్ని నిర్వహిస్తున్నట్లు ఏసీబీ గుర్తించింది. ఈ విభాగంలో నిష్ణాతులైన న్యాయవాదులతో పాటు పలువురు మాజీ, ప్రస్తుత పోలీసు ఉన్నతాధికారులు ఉన్నట్లు అనుమానిస్తోంది. వారి ఆధ్వర్యంలోనే విచారణకు హాజరయ్యే వారందరికీ... ఏసీబీ వద్ద ఎలా వ్యవహరించాలో సలహాలు, సూచనలు ఇస్తున్నట్లు సమాచారం. ఈ తర్ఫీదు ఇస్తున్న వారు ఎవరనే అంశాలపై ఏసీబీ దృష్టి పెట్టింది. ఈ కేసులో విచారణకు డుమ్మా కొట్టిన వారు ఏపీలో ఆశ్రయం పొందినట్లుగా కూడా ఏసీబీ గుర్తించింది. అక్కడ వీరికి షెల్టర్ ఇచ్చిన వారికీ నోటీసులు ఇవ్వాలని భావిస్తోంది.