213 కాలేజీలు.. 95 వేల సీట్లు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో 19 వేల ఇంజనీరింగ్ సీట్లకు కోత పడింది. అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) రాష్ట్రంలోని 228 కాలేజీల్లో 1,14,117 సీట్లకు అనుమతి ఇవ్వగా.. యూనివర్సిటీలు మాత్రం 213 కాలేజీల్లోని 95,235 సీట్లకే అనుబంధ గుర్తింపు ఇచ్చాయి. 15 కాలేజీల్లోని 19 వేల సీట్లకు కోత పెట్టాయి. ఇందులో కొన్ని కాలేజీలు సొంతంగా మూసివేసుకున్నవి కూడా ఉన్నాయి. మరోవైపు యూనివర్సిటీలు అనుబంధ గుర్తింపు ఇచ్చిన 29 కాలేజీల్లోని 4 వేలకు పైగా సీట్లను యాజమాన్యాలే తమ కన్సార్షియం ద్వారా సొంతంగా భర్తీ చేసుకోనున్నాయి. మిగిలిన 184 కాలేజీల్లో 90,900 సీట్లు అందుబాటులో ఉండగా, కన్వీనర్ కోటాలో 64,500 సీట్లను భర్తీ చేసేందుకు ప్రవేశాల కమిటీ చర్యలు చేపట్టింది. ఈనెల 25వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్‌కు అవకాశం కల్పించగా.. 28 నుంచి (సోమవారం) విద్యార్థులకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌తోపాటు వెరిఫికేషన్ చేయించుకున్న వారు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకునేందుకు ఏర్పాట్లు చేసింది.
నేటి నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్, వెబ్ ఆప్షన్లు
ఈ నెల 28వ తేదీ నుంచి వచ్చే నెల 3వ తేదీ వరకు హెల్ప్‌లైన్ కేంద్రాల్లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేయించుకోవాలని ప్రవేశాల కమిటీ పేర్కొంది. హెల్ప్‌లైన్ కేంద్రాల వివరాలను, వెంట తెచ్చుకోవాల్సిన సర్టిఫికెట్ల వివరాలను, ర్యాంకుల వారీగా సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేపట్టే వివరాలను, వెబ్ ఆప్షన్లు ఇచ్చే సమయంలో పాటించాల్సిన జాగ్రత్తలను తమ వెబ్సైట్లో (https://tseamcet.nic.in) పొందుపరిచామని తెలిపింది. అభ్యర్థులు వెబ్సైట్లో వివరాలను అనుసరించాల్సి ఉంటుందని పెర్కొంది. 1వ ర్యాంక్ నుంచి 10 వేల ర్యాంక్ వరకు తొలిరోజు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుంది. స్పెషల్ కేటగిరీ విద్యార్థులకు 1వ ర్యాంక్ నుంచి 40 వేల వరకు ఉంటుంది. స్పెషల్ కేటగిరీ విద్యార్థులకు సాంకేతిక విద్యా భవన్లో వెరిఫికేషన్ ఉంటుంది. వెరిఫికేషన్ పూర్తయిన వారు వచ్చే నెల 5వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని పేర్కొంది. ఆప్షన్లు ఇచ్చుకున్న విద్యార్థులకు వచ్చే నెల 8వ తేదీన మొదటి దశ సీట్ల కేటాయింపును ప్రకటించనుంది.