వ్యవసాయ బీమా వైపు చూడండి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బీమా బ్రోకర్లు, సాధారణ బీమా కంపెనీలు వ్యవసాయ బీమాకు ప్రాధాన్యతను పెంచాలని ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ, డెవలప్మెంట్ అథారిటీ (ఐఆర్డీఏ) చైర్మన్ టి.ఎస్.విజయన్ సూచించారు. వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాలు, విపత్తు నిర్వహణకు అవసరమైన బీమా ఉత్పత్తుల విక్రయంపై దృష్టిసారించాలని అన్నారు. వ్యవసాయ బీమాలో సింహభాగం ప్రభుత్వ నిర్వహణలోనే ఉంది.
అందుకే ఈ విభాగంలో అపార అవకాశాలున్నాయి అని చెప్పారు. శుక్రవారమిక్కడ ఇన్సూరెన్స్ బ్రోకర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ఐబీఏఐ) శిఖరాగ్ర సమావేశంలో ఆయన కీలకోపన్యాసం చేశారు. బీమా బ్రోకరేజి సంస్థల్లో పనిచేసే సిబ్బందికి ఇచ్చే శిక్షణలో ఎప్పటికప్పుడు కొత్త సిలబస్‌ను పరిచయం చేస్తున్నట్టు చెప్పారు.
100 శాతం ఎఫ్‌డీఐకి వ్యతిరేకం..
బీమా బ్రోకింగ్, పంపిణీ, థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటర్స్(టీపీఏ) రంగంలో ఎఫ్‌డీఐలను ప్రస్తుతమున్న 26 శాతం నుంచి 100 శాతానికి పెంచాలన్న ప్రతిపాదనకు తాము పూర్తి వ్యతిరేకమని ఐబీఏఐ స్పష్టం చేసింది. ప్రభుత్వ నిర్ణయం అమలైతే బ్రోకింగ్ సమాజానికి హాని కలుగుతుందని ఐబీఏఐ ప్రెసిడెంట్ సోహన్‌లాల్ కడేల్ తెలిపారు.
బీమా రంగం వృద్ధిలో బ్రోకర్ల పాత్ర కీలకంగా ఉందని చెప్పారు. దేశవ్యాప్తంగా ఉన్న 35 లక్షల మంది బీమా ఏజెంట్లను బ్రోకరేజి సంస్థల కిందకు తేవాలని ఐఆర్‌డీఏను కోరుతున్నట్టు వెల్లడించారు. ఐబీఏఐలో ప్రస్తుత సభ్యుల సంఖ్య 315 ఉంది. 2012-13లో బ్రోకరేజ్ సంస్థల వ్యాపారం నాన్ లైఫ్ బీమాలో 24%, జీవిత బీమాలో 0.5 శాతం ఉంది.