వేసవిలో భక్తులకు విస్తృత ఏర్పాట్లు
► టీటీడీ ఈవో దొండపాటి సాంబశివరావు
► కాలిబాట భక్తులకు తాత్కాలిక షెడ్ల నిర్మాణం
► ఉగాది నుంచి మొబైల్ యాప్ ప్రయోగాత్మకంగా ప్రారంభం
తిరుమల: తిరుమల శ్రీవారి దర్శనార్థం వేసవి సెలవుల్లో విశేష సంఖ్యలో భక్తులు వస్తారు. భక్తులకు మరింత మెరుగైన సేవలందించేందుకు సన్నద్ధంకావాలని ఆయా విభాగాధిపతులకు టీటీడీ ఈవో దొండపాటి సాంబశివరావు ఆదేశించారు. తిరుమలలోని అన్నమయ్యభవనంలో మంగళవారం జేఈవో కెఎస్.శ్రీనివాసరాజుతో కలిసి టీటీడీ సీనియర్ అధికారులతో ఈవో వారపు సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ.., వేసవిలో భక్తులకు కల్పించాల్సిన ఏర్పాట్లపై విభాగాలవారీగా పలు సూచనలు చేశారు. ఏప్రిల్ రెండో వారం నుంచి భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉండటంతో తిరుపతిలోని అలిపిరి చెక్‌పాయింట్ వద్ద నూతన స్కానర్లను ఏర్పాటు చేయాలని విజిలెన్స్ అధికారులకు సూచించారు. కాలిబాట భక్తుల కోసం నారాయణిగిరి ఉద్యానవనంలో తాత్కాలిక షెడ్లు నిర్మిస్తామన్నారు. శ్రీవారి ఆర్జితసేవలు, దర్శనం, వసతి తదితర సేవలను భక్తులు పొందేందుకు రూపొందించిన మొబైల్ యాప్‌ను శ్రీ హేమలంబినామ సంవత్సరం ఉగాదిరోజు బుధవారం నుంచి ప్రయోగాత్మకంగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని టీటీడీ ఐటీ, టీసీఎస్ అధికారులను ఆదేశించారు.
టీటీడీ ప్రారంభిస్తున్న ఆన్లైన్ అప్లికేషన్‌కు భక్తుల నుంచి విశేష స్పందన లభిస్తోందని ఈవో తెలిపారు. టీటీడీలో 2200 మంది కాటేజి దాతలు ఉండగా ఇప్పటికే 1500 మంది దాతలు కాటేజీ డోనార్మేనేజ్మెంట్ సిస్టమ్ ఆన్లైన్ అప్లికేషన్లో నమోదు చేసుకున్నారని, ఇది ఆహ్వానించదగ్గ విషయమని తెలిపారు. శ్రీవారి దర్శనం, లడ్డూప్రసాదం, వసతి తదితర అంశాలలో అక్రమాలకు పాల్పడేవారిపై సమాచారం అందించినవారికి ప్రత్యేక ప్రోత్సాహక బహుమతి అందిస్తామని ఈవో తెలిపారు. టీటీడీ అందిస్తున్న సేవలపై నేషనల్ జియోగ్రఫీ ఛానల్లో ప్రసారమైన డాక్యుమెంటరీ అద్భుతంగా ఉందని తెలిపారు.,టీటీడీ కార్యక్రమాలను ప్రపంచంవ్యాప్తంగా ఉన్న భక్తులకు చేరువ చేసేందుకు మరిన్ని ఛానళ్లు డాక్యుమెంటరీ చిత్రీకరణకు ముందుకురావాలని ఈవో కోరారు.