రాజధానికి తుళ్లూరు భూములు వద్దు: రఘువీరా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అత్యంత సారవంతమైన భూములు తుళ్లూరులో ఉన్నాయని, వాటిని రాజధాని నిర్మాణం కోసం తీసుకోవడం తగదని ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి అన్నారు. 365 రోజులూ అన్ని రకాల పంటలు పండించుకోవటానికి ఈ భూములు అనువైనవని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నేతలతో పాటు ఆయన తుళ్లూరులోని పంటలను, భూములను పరిశీలించారు.
రాజధాని నిర్మాణం అవసరమే కానీ అందుకు అత్యంత సారవంతమైన భూములే అవసరం లేదని రఘువీరారెడ్డి చెప్పారు. నేరుగా రైతుల అభిప్రాయాలను తెలుసుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదిక అందజేస్తామని ఆయన తెలిపారు. పరిహారం గురించి అడిగినందుకు తమను పోలీసులు టార్గెట్ చేస్తున్నారని రైతులు రఘువీరారెడ్డి ఎదుట వాపోయారు.