దళితులు మరింత అభివృద్ధి చెందాలి
విజయవాడ (భవానీపురం) : సమాజంలో అప్పటికి, ఇప్పటికీ కులవ్యవస్థ వేళ్లూనుకునే ఉందని, ఇప్పుడు కాస్త మెరుగ్గా ఉందని సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు అన్నారు. భారతరత్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ వర్ధంతిని పురస్కరించుకుని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో 60వ మహాపరి నిర్యాణం సందర్భంగా మంగళవారం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. దళితులు వ్యాపారాలు, పరిశ్రమలు స్థాపించే స్థాయికి చేరాలని ఆయన కోరారు. అంబేడ్కర్ ఓవర్సీస్ పథకం కింద 250 మంది విద్యార్థులను విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించేందుకు పంపామని చెప్పారు. అమరావతిలో 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని నిర్మించడంతోపాటు స్ఫూర్తి భవన్‌ను నిర్మించి లైబ్రరీ నెలకొల్పుతామని తెలిపారు. సాంఘిక సంక్షేమ శాఖ సంచాలకుడు రామారావు మాట్లాడుతూ దేశంలో లక్షలాది మందికి దారిచూపిన అంబేడ్కర్ మహాపరి నిర్యాణం పొందిన ఈ రోజును ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు. అనంతరం తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మృతికి సంతాపం తెలియజేస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం సౌదా అరుణ అనువదించిన 'అంబేడ్కర్ వర్ణ నిర్మూలన', 'అంబేడ్కర్ ఆత్మకథ' పుస్తకాలను మంత్రి రావెల ఆవిష్కరించారు. వివిధ రెసిడెన్షియల్ పాఠశాలల నుంచి వచ్చిన విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. సాంఘిక సంక్షేమ శాఖ కృష్ణా, గుంటూరు జిల్లాల జాయింట్ డైరెక్టర్లు ప్రసాద్, మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.