మంత్రాలయంలో పుణ్యహారతి
మంత్రాలయం :
'' వరాహ వదనోద్భవతే శ్రీశైలోత్సంగ గామిని!
తుంగభద్రే మహాపుణ్యే నమోస్తుతే సురప్రియే!!''..
అంటూ తుంగభద్రమ్మను స్మరిస్తూ భక్తలోకం ఆత్మజ్యోతులను సమర్పించుకుంది. కార్తిక పూర్ణిమను పురస్కరించుకుని శ్రీమఠం పీఠాధిపతి సుభుధేంద్రతీర్థులు ఆధ్వర్యంలో సోమవారం రాత్రి పుణ్యహారతి నిర్వహించారు. ముందుగా రాఘవేంద్రస్వామి మూల బృందావనం నుంచి ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయలను ప్రత్యేక వాహనంపై ఊరేగింపుగా బయలు దేరారు. శ్రీమఠం ప్రాంగణం ఎదుట కార్తిక ఘటం జ్యోతి ప్రజ్వలన చేశారు. అక్కడి నుంచి గజరాజు, మంగళవాయిద్యాలు, భజనలతో ఊరేగింపుగా తుంగభద్ర తీరం చేరుకున్నారు. తుంగభద్ర నదికి శాస్త్రోక్తంగా అర్చనలు చేశారు. అర్చకులు వేదపఠనం గావిస్తూ సప్త హారతులు పట్టారు. శ్రీమఠం చేరుకుని గురుసార్వభౌమ దాస సాహిత్య ప్రాంగణంలో భజనలు చేశారు. దీపోత్సవంలో జిల్లా కోర్టు జడ్జి అనుపమ చక్రవర్తి, జిల్లా పరిషత్ సీఈవో ఈశ్వర్ పాల్గొన్నారు.