టునీషియా తరహాలో హైదరాబాద్ అభివృద్ధి
సాక్షి, హైదరాబాద్: ఉత్తర ఆఫ్రికాలోని టునీషియా దేశంలో నిర్మిస్తున్న కొత్త నగరం తరహాలో హైదరాబాద్‌ను అభివృద్ధి చేయాల్సి ఉం దని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అన్నారు. సౌదీ అరేబియా రాయల్ ఫ్యామిలీ ప్రతినిధి డాక్టర్ ఫయీజ్ అల్ అబెదిన్ మంగళవారం సచి వాలయంలో సీఎంతో భేటీ అయ్యారు. తెలంగాణ ఏర్పాటు నేపథ్యంలో కొత్త ప్రభుత్వాన్ని అభినందిస్తూ సౌదీ అరేబియా రాజు పంపిన వర్తమానాన్ని ఆయన సీఎంకు అందజేశారు. తెలంగాణ ఆదర్శవంతమైన లౌకిక రాష్ట్రమని, ఫయీజ్ సంతోషం వ్యక్తం చేశారు. కొత్త రాష్ట్రం అభివృద్ధికి సహకరిస్తామన్నారు. విద్యుత్తు ప్రాజెక్టుల ఏర్పాటు, సాంకేతిక సాయం, వైద్య రంగం లో సహకారం వంటివి అందిస్తామన్నారు. టునీ షియాలో కొత్తగా నిర్మిస్తున్న నగర నమూనాను యానిమేషన్ ఫిల్మ్ ద్వారా ఆయన సీఎంకి చూపారు. హైదరాబాద్ చుట్టుపక్కల సినిమా సిటీ, స్పోర్ట్స్ సిటీ, ఫార్మా సిటీలను నిర్మించాలని భావిస్తున్న ట్టు సీఎం ఆయన దృష్టికి తెచ్చారు. టునీషియాలోని కొత్త నగరం తరహాలో అభివృద్ధి.. చరిత్ర ఆనవాళ్లు చెదిరిపోకుండా ఇస్తాం బుల్ తరహా విధానాలను అవలంబిస్తామని వివరించారు. సమావేశంలో ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ, విద్యుత్ శాఖ మంత్రి లక్ష్మారెడ్డి, సీఎస్ రాజీవ్ శర్మ, సీఎం కార్యాలయ ముఖ్యకార్యదర్శి నర్సింగరావు, పాల్గొన్నారు.