షాకింగ్ వీడియో విడుదల చేసిన కుర్దిష్
హక్కారీ: కుర్దిస్తాన్-టర్కీ మధ్య ఘర్షణలకు ఈ ఘటన ఓ సజీవ సాక్ష్యం. వారి మధ్య ఎంతటి వైరం నెలకొందో తెలుసుకునేందుకు ఇదొక మరో దృశ్యం. జవాన్లతో వస్తున్న రెండు టర్కీ మిలటరీ వాహనాలను రెండు శక్తమంతమైన ఐఈడీ బాంబులతో కుర్దీష్ సేనలు అతి దారుణంగా పేల్చివేశాయి. ఈ బాంబుల ధాటికి ఆ రెండు జీపులు కూడా గాల్లో కొన్ని మీటర్ల ఎత్తులో ఎగిరి తునాతునకలైపోయింది. ఈ ఘటనలో నలుగురు టర్కీ జవాన్లు ముక్కముక్కలైపోయారు. ఈ వీడియోను కుర్దిస్తాన్కు చెందిన కుర్దిస్తాన్ వర్కర్స్ పార్టీ(పీకేకే) తాజాగా విడుదల చేసింది. ఈ వీడియో చూసిన ఎవరికైనా గుండెలు అదిరిపడాల్సిందే.
వారు చెప్పిన వివరాల ప్రకారం కుర్దిస్తాన్ సరిహద్దులోని టర్కీకి చెందిన హక్కారీ ప్రాంతంలో మే 18న ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ వీడియోలో చూపిన ప్రకారం హక్కారీ ప్రాంతంలోని భారీ కొండల నడుమ ప్రశాంత వాతావరణంలో ఓ రెండు జీపుల్లో కొంతమంది సైనికులు వస్తూ ఉన్నారు. అలా వస్తున్న వారి వాహనాలు అనూహ్యంగా శక్తిమంతమైన బాంబు ధాటికి గురై ప్రాణాలుకోల్పోయారు. ఆ సమయంలో వారు ఈ ప్రాంతం మీదుగా సెమిడిన్లి అనే ప్రాంతానికి వెళుతున్నారు.