టర్కీ విమానానికి బాంబు బూచి
ఢిల్లీ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్
న్యూఢిల్లీ: బాంబు బెదిరింపు వార్తతో టర్కీ విమానాన్ని మంగళవారం ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా దింపారు. టర్కీకి చెందిన 330 ఎయిర్ క్రాఫ్ట్ విమానం 134 మంది ప్రయాణికులతో ఇస్తాంబుల్ నుంచి బ్యాంకాక్ వెళుతోంది. విమానం టాయిలెట్ రూంలోని అద్దాలపై గుర్తు తెలియని వ్యక్తులు బాంబు పెట్టినట్లు లిప్స్టిక్తో రాశారు. ఇది గమనించిన విమాన సిబ్బంది వెంటనే అప్రమత్తమై నాగ్పూర్ ఏటీసీకి సమాచారం అందించారు. వారి సూచన మేరకు ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాన్ని దింపారు.
సీఐఎస్ఎఫ్ బలగాలు, బాంబ్ స్క్వాడ్ సిబ్బంది విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసి పేలుడు పదార్థాలు లేవని తేల్చినట్లు పౌరవిమానయాన కార్యదర్శి ఆర్.ఎన్. చౌబే మీడియాకు తెలిపారు. పూర్తిగా తనిఖీలు చేసిన అనంతరం రాత్రి 9.30 గంటలప్రాంతంలో విమానాన్ని పంపేందుకు అనుమతినిచ్చినట్లు చెప్పారు. కాగా, విమానంలో బాంబు తనిఖీకి దాదాపు మూడు గంటల సమయం పట్టినట్లు పౌర విమానయాన శాఖ సహాయమంత్రి మహేశ్ శర్మ తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను సీఐఎస్ఎఫ్ డెరైక్టర్ జనరల్ సురేందర్ సింగ్ కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్కు వివరించారు.