టీవీ మెకానిక్ కుమార్తె జూనియర్ సివిల్ జడ్జి
తొలి ప్రయత్నంలోనే హరిప్రియ ఎంపిక
మరో జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికైన విజయలక్ష్మి
విజయనగరం లీగల్/మున్సిపాలిటీ: తల్లిదండ్రులు తన కోసం పడ్డ కష్టాలను కనులారా చూసింది. తనతో పాటు తన అక్కను కని పెంచి ఉన్నత చదవులు చదివించేందుకు వారు పడ్డ కష్టాన్ని చెరిపేసి , వారు కన్న కలలను సాకారం చేయాలని నిర్ణయించుకుంది. అందుకోసం పట్టుదలతో న్యాయవాది వృత్తిని ఎంచుకుంది. తను ఎంచుకున్న రంగంలోనే రాణిస్తూనే తొలి ప్రయత్నంలోనే ఉన్నత శిఖరాన్ని అధిరోహించటం ద్వారా తల్లిదండ్రుల స్వప్నాన్ని నిజం చేసింది.
ఆమె పట్టణ శివారులోని గాజులరేగలో నివసిస్తున్న చందక భాను, మంగ దంపతుల ద్వితీయ కుమార్తె హరిప్రియ. గాజులరేగ గ్రామంలో టీవీ మెకానిక్ వృత్తి చూసుకుంటూ పెద్ద కుమార్తెను సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా చదివించిన భాను ఈ దశలో పస్తులున్న సందర్భాలు ఆ జీవితంలో లేకపోలేదు. ద్వితీయ కుమార్తె హరిప్రియ తన చిన్నాన్న చిన్నప్రభాకర్ స్ఫూర్తితో ఎంచుకున్న న్యాయవాద వృత్తిలో రాణించేందుకు తమ వంతుగా ప్రోత్సాహాన్ని అందించారు.
తల్లిదండ్రుల ప్రోద్బలంతో హరిప్రియ జూనియర్ సివిల్‌జడ్జిగా ఎంపికైంది. 2015 సంవత్సరంలో విజయనగరం ఎంఆర్‌వీఆర్ లా కళాశాలలో న్యాయ విద్యను పూర్తి చేశారు. 2016 సంవత్సరంలో హైకోర్టు జూనియర్ సివిల్ జడ్జి పోస్టుల నియామకాలపై నోటిఫికేషన్ జారీ చేయగా..పట్టుదలతో, అమ్మనాన్నల ప్రోత్సాహంతో మొదటి ప్రయత్నంలో తన లక్ష్యాన్ని చేరుకుంది. హైకోర్టు విడుదల చేసిన ఫలితాల్లో జూనియర్ సివిల్ జడ్జిగా నియామకాన్ని సాధిస్తూ విద్యలకు నగరమైన విజయనగరం జిల్లా ఖ్యాతిని చాటి చెప్పింది.
విజయలక్ష్మి ఎంపిక
కృషి ఉంటే సాధించ లేనిదంటూ ఏమిలేదన్న విషయాన్ని మరో మారు రుజువు చేశారు విజయనగరం ఫ్యామిలీ కోర్టులో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న గరుడపల్లి విజయలక్ష్మి. తల్లిదండ్రులు గురడపల్లి ధర్మానంద్, సింహాచలం స్వస్థలం బాడంగి మండలం కామన్నవలస. వీరి ముగ్గురు కుమార్తెల్లో మొదటి సంతానమైన విజయలక్ష్మి 2007 జుడిషీయల్ డిపార్ట్మెంట్లో చేరగా... రెండవ కుమార్తె› నాగమణి విశాఖ ఉమెన్ పోలీస్‌స్టేషన్ ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నారు.
మూడవ కుమార్తె అరుణకుమారి డిగ్రీ విద్యనభ్యసిస్తున్నారు. విజయలక్ష్మి భర్త సునీల్‌కుమార్ రైల్వే శాఖలో విధులు నిర్వహిస్తుండగా...ఆయనతో పాలు తల్లిదండ్రులు ఇచ్చిన ప్రోత్సాహంతో 2016లో పరీక్షల్లో జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికైంది. ఇదిలా ఉండగా జిల్లా న్యాయ వ్యవస్థ చరిత్రలో కోర్టు సిబ్బంది స్థాయి నుంచి జూనియర్ సివిల్ జడ్జిగా ఎదిగిన తొలి మహిళగా గుర్తింపు పొందారు.