ముస్తాబు చేసి తీసుకొస్తామని..
దీప్తిని పథకం ప్రకారమే హత్యచేసిన తల్లిదండ్రులు
నిందితుల అరెస్టు
గుంటూరు, న్యూస్‌లైన్: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దీప్తి పరువు హత్య కేసులో నిందితులైన ఆమె తల్లిదండ్రులు పచ్చల హరిబాబు, సామ్రాజ్యంలను పట్టాభిపురం పోలీసులు మంగళవారం అరెస్టుచేశారు. నిందితులు గుంటూరులోని స్తంభాలగరువు ప్రాంతంలో ఉన్నట్లు సమాచారం అందిందని, అక్కడే వారిని అరెస్ట్ చేశామని గుంటూరు వెస్ట్ డీఎస్పీ టి.వి. నాగరాజు తెలిపారు. ఈ సందర్భంగా విలేకరులకు వివరాలు వెల్లడించారు.
హైదరాబాద్‌లోని హెచ్‌సీఎల్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న దీప్తి.. అదే కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేసి ప్రస్తుతం అమెరికాలో ఉంటున్న తూర్పుగోదావరి జిల్లా రాజవొమ్మంగికి చెందిన అనంతపల్లి కిరణ్ కుమార్‌ను ప్రేమ వివాహం చేసుకోవాలని అనుకుంది. వీరిద్దరి కులాలు వేరు కావడంతో పెళ్లికి దీప్తి తల్లిదండ్రులు అంగీకరించలేదు. ఈ పెళ్లి చేసుకుంటే తమ పరువు పోతుందని, మాట వినకపోతే తాము ఆత్మహత్య చేసుకుంటామని దీప్తిని వారు బెదిరించారు. అంతేగాక ఆమెకు పెళ్లిసంబంధాలు కూడా చూడడం ప్రారంభించారు. ఇది తెలుసుకున్న దీప్తి, కిరణ్‌ను భారత్‌కు రప్పించి ఈ నెల 21న అతని తల్లిదండ్రులు, స్నేహితుల సమక్షంలో హైదరాబాద్‌లోని ఆర్యసమాజంలో వివాహం చేసుకుంది. ఈ విషయాన్ని దీప్తి తన తల్లిదండ్రులకు తెలియజేసింది.
రిసెప్షన్ ఏర్పాటు చేస్తామని..
సమాచారమందుకున్న దీప్తి తల్లిదండ్రులు, పెదనాన్న సాంబశివరావు హైదరాబాదు చేరుకున్నారు. ముందస్తు పథకం ప్రకారం కిరణ్ బంధువుల వద్దకు వెళ్లి తాము దీప్తి వివాహానికి సానుకూలంగా ఉన్నామని, గుంటూరు జిల్లాలోని పాములపాడులో మొక్కుతీర్చుకోవాలంటూ నమ్మబలికారు. అంతేగాక తమ బంధువులందర్నీ పిలిచి రిసెప్షన్‌ను ఏర్పాటుచేస్తామని కూడా చెప్పారు. కుటుంబసమేతంగా రావాలని కిరణ్‌ను కోరారు. దీనికి అంగీకరించిన కిరణ్ తల్లిదండ్రులు, బంధువులు ఈ నెల 23 తెల్లవారుజామున గుంటూరు చేరుకున్నారు.
హత్య జరిగిందిలా..
కిరణ్, అతని బంధువులకు పాములపాడు వెళ్ళేందుకు సిద్ధమవ్వమని చెప్పి, తమ కుమార్తెను ముస్తాబు చేసి తీసుకువస్తామని వారు బసచేసిన లాడ్జి నుంచి దీప్తిని గుంటూరులోని రాజేంద్రనగర్ 2వ లైనులో ఉన్న తమ ఇంటికి ఆమె తల్లిదండ్రులు తీసుకెళ్లారు. వారిపై నమ్మకం లేకపోవడంతో దీప్తి తల్లిదండ్రుల్ని అనుసరించాలని కిరణ్ తన స్నేహితులను పంపాడు. దీప్తిని ఇంట్లోకి తీసుకెళ్లడంతోనే ఆగ్రహంతో పరువుతీశావంటూ ఊగిపోయిన హరిబాబు బలంగా ఆమె మెడపై కొట్టాడు. ఆ దెబ్బకు దీప్తి మంచంపై పడిపోయింది. వెంటనే ఆమె మెడకు చున్నీని గట్టిగా బిగించి మంచం కోళ్లకు కట్టారు. కాళ్లు కదలించకుండా దీప్తి కాళ్లను తల్లి పట్టుకుంది. దీంతో దీప్తికి ఊపిరాడకుండా చేసి హతమార్చారు. కుమార్తె చనిపోయిందని నిర్ధారించుకున్న అనంతరం భార్యాభర్తలు ఇంటికి తాళం వేసి మోటార్‌సైకిల్‌పై పరారయ్యారు.
వారు హడావుడిగా బయటకు వెళ్లడాన్ని గమనించిన కిరణ్ స్నేహితులు ఆవిషయాన్ని కిరణ్‌కు తెలియజేశారు. అక్కడకు చేరుకున్న కిరణ్, అతని బంధువులు ఇంటి తాళాన్ని పగులకొట్టి చూడగా.. మంచంపై దీప్తి నిర్జీవంగా కనిపించింది. ఒక పథకం ప్రకారమే దీప్తిని తల్లిదండ్రులు హత్య చేశారనే విషయం తమ విచారణలో వెల్లడైందని డీఎస్పీ తెలిపారు. కొన్నేళ్లపాటు తన జీతాన్ని తల్లిదండ్రులకు పంపే విధంగా కిరణ్‌ను దీప్తి ఒప్పించిందని, కూతురు మనసు తెలుసుకోకుండా తల్లిదండ్రులు ఆమెను హతమార్చారని ఆయన చెప్పారు. హత్యకేసు ఛేదించిన సిబ్బందిని ఆయన అభినందించారు. అనంతరం నిందితులను కోర్టులో హాజరుపర్చారు.
మాట వినలేదనే హతమార్చా..
అల్లారు ముద్దుగా పెంచుకున్న కుమార్తె తమ మాట కాదని కులాంతర వివాహం చేసుకోవటాన్ని జీర్ణించుకోలేకపోయామని దీప్తి తండ్రి హరిబాబు విలేకరులకు తెలిపారు. ఇంటికి రాగానే వివాహ విషయం ప్రస్తావించటంతో తనపై దీప్తి చేయిచేసుకుందని, క్షణికావేశంలో ఆమెను హతమార్చానని చెప్పారు. ఈ హత్యతో తన భార్యకు ఎటువంటి సంబంధం లేదని వెల్లడించారు.