పేదల గుడిసెలపై ఖాకీ ప్రతాపం
సంతనూతలపాడు, న్యూస్‌లైన్ : పేర్నమిట్ట సమీపంలోని కందరగుంట వద్ద ఉన్న ప్రభుత్వ భూమిలో 120 మంది పేదలు గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్నారు. గుడిసెలు అక్రమంగా వేశారని పోలీసులకు రెవెన్యూ అధికారులు ఫిర్యాదు చేశారు. ఒంగోలు డీఎస్పీ పి.జాషువా ఆధ్వర్యంలో శనివారం ఉదయం గుడిసెలు కూల్చి వేశారు. వివరాలు.. కందరగుంట ప్రభుత్వ భూమిలో సుమారు 25 సంవత్సరాల క్రితం పేర్నమిట్ట గ్రామానికి చెందిన దళితులకు పట్టాలిచ్చారు. కాలక్రమంలో వారి వద్ద నుంచి అదే గ్రామానికి చెందిన బొడ్డు వెంకయ్య ఆ భూమిని కొనుగోలు చేశాడు. అతని నుంచి ఒంగోలుకు చెందిన టీవీ శ్రీరామమూర్తి కొనుగొలు చేసి ఆ భూమిలో ప్లాట్లు వేసి అమ్ముకున్నాడు. ఒంగోలుకు చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు కూడా ప్లాట్లు కొనుగోలు చేశారు. పది రోజుల నుంచి మళ్లీ గుడిసెలు వేస్తున్నారని అధికారులకు సమాచారం అందింది.
నగరపాలక సంస్థ, తహసీల్దార్ కార్యాలయం సిబ్బంది సహకారంతో పోలీసులు గుడిసెలు తొలగించారు. దళితులకు కేటాయించిన ప్రభుత్వ భూమిపై ఇతరులకు హక్కు ఉండదని అధికారులు చెబుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ భూమి ఆక్రమించుకోవడం నేరమని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో గుడిసెలు వేసుకున్న కొందరు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.దళారులను నమ్మి మోసపోయామంటున్నారు. ఒక్కో గుడిసెకు * 3 నుంచి 5 వేల వరకు దళారులు వసూలు చేశారని ఆరోపించారు. పేర్నమిట్ట పరి శర ప్రాంతాల్లో అద్దెలు చెల్లించలేక ఇక్కడ గుడిసెలు వేసుకుని దళారుల ను నమ్మి మోసపోయారు. గుడిసెల తొలగింపు కార్యక్రమంలో తహసీల్దార్ ఎం.గాంధీ, ఆర్ఐ కె.కాశీయ్య, సర్వేయర్ నందయ్య, వీఆర్ఓలు మోహన్‌రెడ్డి, శ్రీరాములు, ఒంగోలు తాలుకా సీఐ శ్రీవాసన్, సీసీఎస్ సీఐ బీటీ నాయక్, మద్దిపాడు ఎస్సై భక్తవత్సలరెడ్డితో పాటు 70 మంది కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.