మాస్టర్ అథ్లెట్స్‌కి ప్రభుత్వ సహకారం అందించాలి
నెల్లూరు(బృందావనం) : అంతర్జాతీయస్థాయిలో తమ వయోభారాన్ని సైతం ఖాతరు చేయకుండా యువతలో స్ఫూర్తి నింపేలా అథ్లెటిక్ పోటీల్లో పాల్గొని పతకాలు సాధిస్తున్న మాస్టర్ అథ్లెట్స్‌కు ప్రభుత్వ సహకారం అందించాలని ఆంధ్రప్రదేశ్ మాస్టర్స్ అథ్లెటిక్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ టీవీ రావు అన్నారు. నెల్లూరులోని కిలారి తిరుపతినాయుడు కల్యాణమండపంలో ఆదివారం జరిగిన అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రం నుంచి అంతర్జాతీయస్థాయి మాస్టర్ అథ్లెటిక్ పోటీల్లో పాల్గొంటూ పఽతకాలు సాధిస్తున్న వారికి ఆర్థిక సాయం చేయాన్నారు.
చివరివారంలో రాష్ట్రస్థాయి అథ్లెట్ మీట్
ఈ ఏడాది డిసెంబరు చివరి వారంలో రాష్ట్రస్థాయి మాస్టర్ అథ్లెటిక్మీట్ను విజయవాడలో జరుగుతుందని టీవీ రావు వెల్లడించారు. ఇందులో విజేతలుగా నిలిచిన వారు జాతీయస్థాయిలో 2017 మార్చి 25 నుంచి 28 వరకు అహ్మదాబాద్‌లో జరుగనున్న పోటీల్లో పాల్గొనే అర్హత సాధిస్తారన్నారు. త్వరలో జిల్లాస్థాయి పోటీలను సైతం నిర్వహించనున్నట్లు ఆయన వివరించారు. సమావేశంలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి టి.సుబ్బారావు, వైస్ ప్రెసిడెంట్ ఎన్.సాంబశివరావు, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రవి, జిల్లా అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నిర్మల నరసింహారెడ్డి, వై.కోటేశ్వరమ్మ, చీఫ్ ప్యాట్రన్ హైటెక్ రమణారెడ్డి, రత్నం పాల్గొన్నారు.