మా భర్తల అరెస్ట్ అక్రమం
హైకోర్టులో వెంకట్రామిరెడ్డి, రవిరెడ్డిల సతీమణులు పిటిషన్
14 రోజుల కస్టడీ కోరుతూ ప్రత్యేక కోర్టుకు సీబీఐ పిటిషన్
సాక్షి, హైదరాబాద్: డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ లిమిటెడ్ (డీసీహెచ్ఎల్) చైర్మన్ టి.వెంకట్రామిరెడ్డి, వైస్ చైర్మన్ టి.వినాయక్ రవిరెడ్డిల అరెస్ట్‌ను సవాలు చేస్తూ వారి సతీమణులు సోమవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. లంచ్‌మోషన్ రూపంలో దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను న్యాయమూర్తి జస్టిస్ విలాస్ అఫ్జల్ పుర్కర్ విచారించారు. ఈ వ్యాజ్యంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐని ఆదేశించిన న్యాయమూర్తి, తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేశారు.
బెయిల్ పిటిషన్లు దాఖలు చేసుకునేందుకు వెంకట్రామిరెడ్డి, రవిరెడ్డిలకు స్వేచ్ఛనిస్తూ ఆ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఇదిలాఉండగా, సీబీఐ అధికారులు ఎఫ్ఐఆర్లో తన పేరును చేర్చడాన్ని సవాలు చేస్తూ చార్టర్డ్ అకౌంటెంట్ మణి ఓమెన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిని విచారించిన న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరామ్ తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేశారు.
డీసీ డెరైక్టర్ల కస్టడీ పిటిషన్‌పై 19న విచారణ
వెంకట్రామిరెడ్డి, వినాయక్ రవిరెడ్డిలను 14 రోజుల కస్టడీకి అప్పగించాలని సీబీఐ ప్రత్యేక కోర్టుకు నివేదించింది. ఈ మేరకు సోమవారం పిటిషన్ దాఖలు చేసింది. పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తి... కౌంటర్ దాఖలు చేసేందుకు పిటిషనర్ తరఫు న్యాయవాదికి గడువునిస్తూ విచారణను ఈ నెల 19కి వాయిదా వేశారు.
ప్రత్యేక సౌకర్యాలు కల్పించండి
రాజ్యసభ మాజీ సభ్యుడిగా, పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్‌గా పనిచేసిన వెంకట్రామిరెడ్డికి జైలులో ప్రత్యే క సౌకర్యాలు కల్పించాలని ఆయన తరఫు న్యాయవాది చంద్రశేఖర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆడిట్ బ్యూ రో ఆఫ్ సర్క్కులేషన్ చైర్మన్‌గా పనిచేశారని, కోటి రూపాయల వరకు ఆదాయపన్ను చెల్లిస్తున్నారని తెలిపా రు. పట్టభద్రుడని, అనారోగ్యంతో ఉన్న ఆయనకు జైలుగా ప్రత్యేక కేటగిరీ కింద సౌకర్యాలు కల్పించాలని నివేదించారు. ఈ పిటిషన్‌పై అభ్యంతరాలుంటే తెలపాలని సీబీఐకి సూచి స్తూ దీని విచారణను 18వ తేదీకి వాయిదా వేశారు.